'బాలీవుడ్ లో చేయడానికి ఎదురుచూస్తున్నా'
న్యూఢిల్లీ: తాను బాలీవుడ్ లో నటించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు అమెరికన్ టీవీ షో నటుడు కునాల్ నయ్యర్ తెలిపాడు. అమెరికన్ పాపులర్ టీవీ షో ‘బిగ్ బ్యాంగ్ థియరీ’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కునాల్ నయ్యర్ ..2011లో మాజీ మిస్ ఇండియా నేహా కపూర్‌ను వివాహం చేసుకుని ఢిల్లీలోనే కాపురం పెట్టాడు. ఢిల్లీలో మూలాలున్న కునాల్ ఇప్పటికే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ నిర్మించిన కెనడియన్ సినిమా ‘డాక్టర్ కెబ్బే’లో నటించాడు. ఒక భారతీయుడిగా తనకు బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఎప్పటినుంచో మనసులో నాటుకుపోయిందని అతడు చెప్పాడు. అయితే మంచి ప్రాజెక్టు కోసం వేచిచూస్తున్నానని చెప్పాడు.
తాను నటుడినని..కెమెరా ముందు నిలబడితే చాలు.. అది ఇండియాలో అయినా యూఎస్‌లో అయినా.. నటనలో నిమగ్నమైపోతానని చెప్పాడు. పాత్ర బట్టి తన తీరు ఉంటుంది తప్ప భాష, ప్రాంతం బట్టి ఉండదని ఆయన స్పష్టం చేశాడు. 'క్రికెట్ వరల్డ్ కప్ 2011' ఆధారంగా ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు కునాల్ తెలిపాడు. ఈ నెల్లో భారత్ లో విడుదల కానున్న ఈ డాక్యుమెంటరీతో ఇక్కడ అభిమానులకు చేరువయ్యేందుకు ఇది చక్కటి మార్గంగా భావిస్తున్నాడు.