
పాత్రలో ఒదిగిపోవడమే ముఖ్యం..
చెన్నై: ఊహలు గుసగుసలాడే భామ రాశిఖన్నా యాక్షన్ అనగానే ఆ కారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేస్తుందట. సినిమాలను ఎంచుకునే విషయంలో తనకు ప్రత్యేక వ్యూహం ఏమీ ఉండదంటోంది. సినిమాకు స్క్రిప్టే కీలకమంటున్న ఈ అమ్మడు కథ బావుండకపోతే మన స్పెషల్ స్ట్రాటజీలేవీ పనిచేయవని చెబుతోంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని, మెరుగైన నటన కనబర్చడమే తన విజయరహస్యమని చెబుతోంది. కష్టపడి పనిచేస్తే విజయాలు అవే వస్తాయని నమ్ముతానంటోంది ఈ టాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ రాశీఖన్నా.
బెంగాల్ టైగర్ లాంటి పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేయడం సంతోషంగా ఉందనీ...ఒక్కసారి సినిమాను ఒప్పుకున్న తరువాత నటీనటులు, నిర్మాణ సంస్థల స్థాయి గురించి ఆలోచించననీ, తన ధ్యాసంతా నటనమీదే ఉంటుందని తెలిపింది. మొదటి సారి కలిసినపుడు కొంచెం టెన్షన్ ఉంటుంది తప్ప..బిగ్ స్టార్స్తో నటించడానికి పెద్దగా ఇబ్బంది పడనంటోంది. ఒకసారి పనిచేయడం మొదలు పెట్టిన తరువాత ఆయా పాత్రల్లో ఒదిగిపోతానని, నటన తప్ప ఇంకేదీ గుర్తుకు రాదంటోంది. అంతేకాదు తన నటన ప్రభావం సహనటులమీద చూపించకూడదనే దానిపైనే ఎక్కువ దృష్టిపెడుతానంటోంది.
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి జోరు సినిమాతో మరింత హుషారు పెంచింది. ప్రస్తుతం ఆమె నటించిన జిల్ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఆ మధ్య అక్కినేని నటవారసుడు అఖిల్ తొలిచిత్రంలో రాశిఖన్నా ఐటం సాంగ్ చేస్తోందన్న వార్తలను ఖండిచడమే గాకుండా ఐటెం సాంగ్స్ చేయనని కరాఖండిగా తేల్చి చెప్పింది. త్వరలో షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టబోతున్న బెంగాల్ టైగర్ తో పాటు, కిక్ -2 సినిమాలో రవితేజతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.