అమ్మా అప్పా ఓ తమిళబ్బాయి | HC stays maintenance case against actor Dhanush | Sakshi
Sakshi News home page

అమ్మా అప్పా ఓ తమిళబ్బాయి

Published Thu, Mar 2 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

అమ్మా అప్పా ఓ తమిళబ్బాయి

అమ్మా అప్పా ఓ తమిళబ్బాయి

ధనుష్‌ చాలా పాపులర్‌. ఇది మనందరికీ తెలుసు. మరీ ఇంత పాపులర్‌ అనుకోలేదు. ‘నా కొడుకంటే నా కొడుకు’ అని కొట్టుకునేంత పాపులర్‌! ఎన్‌డీ తివారీని ‘మా డాడీ.. మా డాడీ’ అని ఒకబ్బాయన్నాడు. కోర్టులు తేల్చాయి. ఇప్పుడు ధనుష్‌ను నా కొడుకంటే... నా కొడుకని లొల్లి చేస్తున్నారు ఇద్దరు నాన్నలు. కోర్టులు తేల్చాలి. ఇదీ సంగతి. ఎవర్ని ముంచుతారో... ఎవర్ని తేలుస్తారో? ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చూసి ఎంజాయ్‌ చేసినవాళ్లు ‘కొడుకుకు ప్రేమతో’ అన్న ఈ సినిమా చదివి ఎంజాయ్‌ చేస్తారనుకుంటున్నాం...

ధనుష్‌ ఎవరు? సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు. ఒకప్పటి తమిళ దర్శకుడు కస్తూరి రాజా తనయుడు.

తెలుగులో ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాలు తీసిన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్‌ తమ్ముడు. మనకు ఇంతవరకే తెలుసు. అయితే ఇవన్నీ అబద్ధాలు అంటోంది ఓ వృద్ధ తమిళ జంట. ‘అతడు మా రక్తం పంచుకు పుట్టిన కన్నబిడ్డ’ అంటున్నారు. అంతే కాదు... ‘కావాలంటే పుట్టుమచ్చలు పరీక్షించుకోండి. డీఎన్‌ఏ టెస్టులు చేసుకోండి. ధనుష్‌ ముమ్మాటికీ మా బిడ్డే’ అంటూ న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఆ దంపతుల పేర్లు ఆర్‌. కదిరేశన్, మీనాక్షి. కోర్టు ఈ వృద్ధ దంపతుల వాదనను అర్థం చేసుకుని, ధనుష్‌కి సమన్లు జారీ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఎవరీ కదిరేశన్‌??
ధనుష్‌ మామగారైన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరో కాకముందు బస్‌ కండక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. యాదృచ్ఛికమో.. మరొకటో... కదిరేశన్‌ కూడా కండక్టరే. ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్లు. ఇటీవలే రిటైర్‌ అయ్యారు. చెన్నైకు సుమారు 500 కిలోమీటర్లు దూరంలో మధురై జిల్లాలోని మేలూర్‌ ఆయన స్వగ్రామం. కదిరేశన్‌కు ముగ్గురు పిల్లలు. ముగ్గురిలో ధనుష్‌ చిన్నోడని ఆయన చెబుతున్నారు.

‘‘ధనుష్‌ అసలు పేరు కలైసెల్వన్‌. మేలూర్‌లో రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించాడు. పదవ తరగతి వరకూ నగరంలోని ఆర్‌.సి. హయ్యర్‌ సెకండరీ స్కూల్, గవర్నమెంట్‌ బాయ్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్స్‌లో చదువుకున్నాడు. 12వ తరగతి కోసం శివగంగ జిల్లాలోని తిరుపత్తూర్‌లో ప్రైవేట్‌ స్కూల్‌లో జాయిన్‌ చేశాం. కానీ, చదువు మధ్యలోనే మానేసి, సినిమా పిచ్చితో చెన్నై చేరుకున్నాడు. కçస్తూరి రాజాతో చేతులు కలిపాడు. అప్పట్నుంచీ మాకు దూరమయ్యాడు. మా కుమారుణ్ణి కలవాలని మేము చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మీరే మాకు న్యాయం చేయాలి’’ అని కదిరేశన్‌ దంపతులు కోర్టు పిటిషన్‌లో పేర్కొన్నారు.

నెలకు 65 వేలు కావాలి!
కదిరేశన్‌ కోర్టులో ధనుష్‌ మా కుమారుడే అని పేర్కొనడంతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు 65 వేలు ఇప్పించాల్సిందిగా కోరారు. మరో ఇద్దరు సంతానం ఉన్నప్పటికీ, వాళ్లు తమ ఆరోగ్యానికీ ఇతర నెలవారీ ఖర్చులకు సరిపడా డబ్బులు ఏర్పాటు చేయలేకపోతున్నారని తెలిపారు. కదిరేశన్, మీనాక్షి దంపతుల వాదనలు విన్న తర్వాత జనవరి 12లోపు న్యాయస్థానం ముందు హాజరు కావాలని ధనుష్‌ని న్యాయమూర్తి ఆదేశించారు. గతేడాది నవంబర్‌ 25న ఈ సంఘటన జరిగింది. ధనుష్‌ తమ కుమారుడే అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్‌ సర్టిఫికేట్, టెన్త్‌ క్లాస్‌ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో ధనుష్‌ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్‌లను సమర్పించారు.

ధనుష్‌ హీరోగా నటించిన మొదటి సినిమా ‘తుళ్లువదో ఇళమై’ 2002 మేలో విడుదలైంది. తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లో ధనుష్‌ను చూసి గుర్తు పట్టామని కదిరేశన్‌ దంపతులు చెబుతున్న మాట. అయితే చిత్ర పరిశ్రమలో ఇటువంటి కేసులు కొత్తేమీ కాదు. ‘నేనే చిరంజీవి పెద్ద కుమారుణ్ణి’ అంటూ గతంలో ఓ జూనియర్‌ ఆర్టిస్ట్, ‘నేను ఫలనా సినీ ప్రముఖుడికి ఫలానా’ అని మరికొందరు మీడియా, మానవ హక్కుల సంఘాలు, న్యాయస్థానాల ముందుకు వచ్చి తమ వాదనలు వినిపించారు. సదరు కేసులన్నీ కొన్ని రోజులకే కంచికి చేరుకున్నాయి. ధనుష్‌ కేసు మాత్రం కోర్టు సాక్షిగా కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. దీనిపై పలు వాదనలు జరిగాయి. మేలూర్‌ కోర్టులో కేసు కొట్టేయవలసిందిగా ధనుష్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది.

బర్త్‌ సర్టిఫికేట్‌లో పేరు లేదా?
న్యాయస్థానంలో ధనుష్‌ సమర్పించిన బర్త్‌ సర్టిఫికేట్‌ జూన్‌ 21, 1993లో ఇష్యూ చేసినట్టు ఉందని కదిరేశన్‌ పేర్కొన్నారు. అందులో ఉన్నట్టు జూలై 28, 1983న ధనుష్‌ జన్మించాడనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ‘అయినా... పదేళ్ల తర్వాత ఇష్యూ చేసిన బర్త్‌ సర్టిఫికేట్‌లో పిల్లాడి పేరు ఎందుకు లేదు? అప్పటికి అతను ఐదవ తరగతికి వచ్చుంటాడు కదా?’ అని ప్రశ్నించారు. ఆర్‌.కె. వెంకటేశ్‌ ప్రభు రాజాగా ఉన్న తన పేరును ధనుష్‌గా 2003లో మార్చుకున్నట్టు ఈ హీరో విన్నవించగా, 2002లోనే ధనుష్‌గా తన పేరును ఈ హీరో పేర్కొన్నట్టు స్పష్టం చేసే పేపర్‌లను కదిరేశన్‌ దంపతులు న్యాయస్థానం ముందుంచారు. దాంతో కేసు జటిలమైంది.

పుట్టుమచ్చ... తప్పలేదు రచ్చ!
కదిరేశన్, మీనాక్షి చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ ధనుష్‌ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో పాటు కొన్ని ఆధారాలు సమర్పించారు. అయితే... కదిరేశన్‌ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయి. ధనుష్‌ న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా... అసలు కదిరేశన్‌ దంపతులు పేర్కొన్న పుట్టుమచ్చులు ధనుష్‌కు లేవని అతడి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

అప్పుడు పుట్టుమచ్చల వెరిఫికేషన్‌ కోసం ఫిబ్రవరి 28లోపు న్యాయస్థానం ముందు ధనుష్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దాంతో మంగళవారం విజయలక్ష్మి, కస్తూరి రాజాలతో కలసి ధనుష్‌ మేలూర్‌ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు రిజిస్టార్‌ సమక్షంలో మేలూర్‌ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్‌ ధనుష్‌ పుట్టుమచ్చలను పరిశీలించారు. అనంతరం ఈ కేసు వాదనను గురువారానికి వాయిదా వేశారు. అయితే గురువారం నాడు డీఎన్‌ఎ టెస్ట్‌ కోసం కదిరేశన్‌ దంపతులు కోర్టుకు సమర్పించాల్సిన నివేదికలను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని న్యాయస్థానం కేసుని మార్చి 9కి వాయిదా వేసింది. కోర్టులో ఏం తీర్పు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ధనుష్‌... కస్తూరి రాజా కొడుకే – విసు
కస్తూరి రాజా దర్శకత్వం వహించిన తొలి తమిళ చిత్రం ‘ఎన్‌ రాసావిన్‌ మనసిలే’ పాతికేళ్ల క్రితం విడుదలైంది. అంతకుముందు ఆయన దర్శక–నిర్మాత–నటుడు విసు దగ్గర 16 సినిమాలకు పని చేశారు. ఆ విధంగా విసుతో కస్తూరి రాజా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ‘ధనుష్‌ తమ కుమారుడే’ అని కదిరేశన్‌ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో విసు పెదవి విప్పారు. ‘‘కస్తూరి రాజా కుటుంబం నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నా దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. ధనుష్‌ పుట్టినప్పుడు కస్తూరి రాజా నా దగ్గరే పని చేస్తున్నాడు. ధనుష్‌... కస్తూరి రాజా–విజయలక్ష్మిదంపతుల కొడుకే. అందులో సందేహం లేదు’’ అంటూ తన కుటుంబంతో కలసి చిన్నప్పుడు ధనుష్‌ దిగిన ఫొటోను బయటపెట్టారాయన.

సిక్స్‌ ఇయర్స్‌... స్వీట్‌ మెమరీ!
కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్‌ చిన్నప్పటి ఫొటోలు... అంటూ కొన్ని ఫొటోలను బయటపెడితే... ధనుష్‌ కూడా తన చిన్న నాటి ఫొటోను ఆ మధ్య ట్వీట్‌ చేశారు. ఆ ఫొటోలో తన సిస్టర్స్‌ విమల గీత, కార్తీకా దేవితో కలసి ఉన్నాడు బుజ్జి ధనుష్‌. అప్పుడు తన వయసు ఆరేళ్లని ఈ హీరో పేర్కొన్నారు. ‘అవి గోల్డెన్‌ డేస్‌. మరచిపోలేనివి’ అని కూడా అన్నారు. మరి.. పదో తరగతి వరకూ తమ దగ్గరే ఉన్నాడని కదిరేశన్‌ దంపతులు చెబుతున్న నేపథ్యంలో ఆరేళ్ల వయసులో సోదరీమణులతో కలసి ధనుష్‌ దిగిన ఫొటో ఎక్కణ్ణుంచి వచ్చింది?

– సత్య పులగం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement