
శర్వానంద్, కల్యాణి
‘హలో.. మీ యాక్టింగ్ నచ్చింది. మీరు చక్కగా ఉన్నారు’ అంటూ ‘హలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన కల్యాణీ ప్రియదర్శన్‌కి ప్రేక్షకులు కితాబులిచ్చారు. మొదటి సినిమాలో అఖిల్‌కి హలో చెప్పిన కల్యాణి ఇప్పుడు రెండో సినిమాకి శర్వాకి హలో చెప్పారు. యస్.. శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కల్యాణిని కథానాయికగా ఎంపిక చేశారట.
ఈ చిత్రంలో శర్వాకి జోడీగా ముందు కాజల్ అగర్వాల్, ఆ తర్వాత నిత్యామీనన్‌ల పేర్లు వినిపించాయి. తాజాగా కల్యాణి పేరు లైన్లోకొచ్చింది. వరుస విజయాలతో దూసుకెళుతోన్న శర్వా, మొదటి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిన కల్యాణిలది మంచి ‘పెయిర్’ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. దాదాపు ఆమెనే ఖరారు చేస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. ఒకటి తన వయసుకి మించిన పాత్ర అని సమాచారం. ఈ పాత్ర సరసన మరో నాయిక నటిస్తారు.