
వీరమాత గౌతమి
విరామం లేదు.. విశ్రాంతి లేదు.. రణభూమిలో రక్తం ఏరులై ప్రవహిస్తోంది. యుద్ధంలో కత్తి దూసిన కుమారుడి జైత్రయాత్రపై అపార నమ్మకం ఉన్నప్పటికీ.. కన్నతల్లి మనసు తల్లడిల్లడం సహజమే. గౌతమిగా హేమమాలిని ఫస్ట్ లుక్.. తల్లి మనోవేదనను కళ్లకు కట్టినట్లుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిసున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇందులో శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీగా హేమమాలిని నటిస్తున్న సంగతి తెలిసిందే.
నేడు హేమమాలిని పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘దసరాకు విడుదల చేసిన టీజర్, అందులో ‘మా కత్తికంటిన నెత్తుటిచార ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా.. రణమా?’ అని బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌లకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి మాటలు: బుర్రా సాయిమాధవ్, పాటలు: సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, సంగీతం: చిరంతన్‌భట్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్.