సాక్షి, పెరంబూరు: నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి విశాల్ రాజీనామా చేయాలని డిమండ్ చేస్తూ నటుడు, దర్శకుడు చేరన్ తమిళ నిర్మాతల మండలికి లేఖ రాశారు. ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా హీరో విశాల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న విశాల్‌పై దండెత్తడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధమైంది.
పోరాటం చేస్తాం: హీరో, దర్శకుడు చేరన్ విశాల్ తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ట్విట్టర్‌లో గొంతు విప్పారు. విశాల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. దీనిపై ఆయన సోమవారం నిర్మాతల మండలికి లేఖను రాశారు. అందులో మొట్టమొదటి సారి పోటీలోనే నకిలీ ముఖంతో ఎవరి ప్రేరేపణతోనో విశాల్ వ్యాపార గర్రంగా మారారని ఆరోపించారు.
అప్పుడు కరుణానిధి.. ఇప్పుడు..! దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో గెలవగానే డీఎంకే నేత కరుణానిధిని కలిసి ఆశీస్సులు అందుకున్న విశాల్ ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత సమాధులకు నివాళులర్పించి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సోమవారం నామినేషన్ దాఖలు చేయడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. విశాల్ చర్యలకు నడిరోడ్డున పడేది నిర్మాతలేనని పేర్కొన్నారు. ఇకపై నిర్మాతలకు పార్టీ, ప్రభుత్వాల నుంచి సహాయం అందదని పేర్కొన్నారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ నిర్మాతలకు మేలు చేసిందేమీ లేదని అరోపించారు.
రాజకీయ లబ్ధి: ఆ పదవిని అడ్డు పెట్టుకుని తను రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నిజంగా నిర్మాతల శ్రేయస్సు కోరితే వెంటనే నిర్మాతల మండలి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్కే.నగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన సాయంత్రం నుంచే విశాల్‌కు వ్యతిరేకంగా నిర్మాతలందరం కలిసి పోరాటం చేస్తామని లేఖలో హెచ్చరించారు. అనంతరం లేఖను నిర్మాతల మండలిలో సమర్పించి మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment