
ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తా: రామ్ చరణ్
విశాఖ : స్టూడెంట్ లైఫ్ తనకు ఇష్టమని ఏడాది పాటు షూటింగ్‌లకు సెలవు పెట్టి కాలేజీలో చేరిపోవాలని ఉందని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తెలిపారు. విద్యార్థలకు నచ్చితే ఎందరినైనా స్టార్లు చేస్తారు, పార్టీలను నిలబెడతారు, నచ్చకపోతే కూల్చగలరని ఆయన అన్నారు. చెరకుపల్లి అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన అవిన్సెస్–2కె17 జాతీయస్థాయి సాంస్కృతిక, క్రీడా ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆదివారం రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్‌ల ద్వారా తనకు వచ్చిన హోదాను కాపాడుకోవడానికి ఒళ్లు దగ్గరపెట్టుకుని అభిమానుల తల ఎత్తుకునేలా పని చేస్తానన్నారు.
గతేడాది ధృవ, ఈ ఏడాది ఖైదీనంబర్ 150తో అభిమానులు తమ కుటుంబానికి మంచి ఊపు ఇచ్చారన్నారు. కాటమరాయుడు టీజర్ బాగుందని ఈ సినిమా ద్వారా ఉగాది నాలుగురోజులు ముందే వస్తుందన్నారు. విద్యార్థుల కోరిక మేరకు షేర్‌ఖాన్.. ఒక్కొక్కర్ని కాదు వందమందిని పంపించు అంటూ ... మగధీరలోని డైలాగ్ చెప్పిన చెర్రీ... వారితో కేరింతలు కొట్టించారు.