
న్యాయవాదితో హీరో రవితేజ సంప్రదింపులు
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో రేపు (శుక్రవారం) సిట్ ఎదుట హాజరు కానున్న నేపథ్యంలో హీరో రవితేజ...న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం రవితేజ రాజాది గ్రేట్, టచ్ చేసి చూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాలకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. విచారణ నిమిత్తం రవితేజ తన నివాసం నుంచి కాకుండా వేరే ప్రాంతం నుంచి సిట్ కార్యాలయానికి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మీడియా తాకిడి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసుతో సంబంధమున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరే సిట్ ముందుకు హాజరవుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉండి.. డ్రగ్స్ తీసుకుంటున్న పలువురు ప్రముఖులకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో వారు ఈ నెల 19 నుంచి సిట్ విచారణకు హాజరు అవుతున్నారు. ఇవాళ సినీనటి ముమైత్ ఖాన్ సిట్ ఎదుట హాజరయ్యారు.
కాగా, డ్రగ్స్ వ్యవహారంలో తన కుమారుడికి సంబంధం లేదని హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి చెప్పిన సంగతి తెలిసిందే. మాదక ద్రవ్యాల కేసులో రవితేజ పేరు బయటకు రావడం తనకు బాధ కలింగించిందని ఆమె అన్నారు.