
‘గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘బందోబస్త్’. సాయేషా సైగల్ కథానాయికగా నటించారు. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమాని నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 13న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. కమాండోగా, రైతుగా సూర్య గెటప్పులు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ‘ఎన్నో తారల సంగమం... అంబరం ఒకటే...’ అంటూ సాగే దేశభక్తి గీతానికి, ‘చెరుకు ముక్కలాంటి...’ అనే మాస్ పాటకు మంచి స్పందన వచ్చింది. పాకిస్తాన్ తీరును ఎండగడుతూ ప్రధాని పాత్రలో మోహన్‌లాల్ చెప్పిన డైలాగ్స్, సూర్య నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి’’ అన్నారు. ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హ్యారీస్ జైరాజ్.
Comments
Please login to add a commentAdd a comment