
తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని నటి త్రిష పేర్కొంది. దక్షిణాదిలో సంచలన నటీమణుల వరుసలో నటి త్రిష పేరు కచ్చితంగా ఉంటుంది. ఇటీవల తెరపైకి వచ్చిన 96 చిత్రంలో ఈ బ్యూటీ నటనకు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా పేట చిత్రంలో నటిస్తోంది. నటీనటుల ట్విట్టర్ అకౌంట్స్ తరచూ హ్యాక్‌కు గురవుతుండడం, ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని సమస్యల్లోకి నెట్టడం జరుగుతుంటుంది.
ఇంతకుముందు కూడా ఇలాంటి ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా హీరోయిన్ల ట్విట్టర్ హ్యాక్‌కు గురవుతుంటాయి. అలా నటి త్రిష ట్విట్టర్ ఇప్పుడు హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని త్రిష శనివారం ఉదయం గుర్తించిందట. దీంతో ఎవరో అగంతుకులు తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారని, అభిమానులెవరూ ఏ విషయాన్ని తన ట్విట్టర్‌కు పోస్ట్ చేయవద్దని ట్వీట్ చేసింది. అదే విధంగా తన పేరుతో పోస్ట్ కాబడిన విషయాలను ఎవరూ నమ్మొద్దు అని పేర్కొంది.
దీని గురించి త్రిష తల్లి ఉమాకృష్ణన్ స్పందిస్తూ ఎవరో అగంతకులు త్రిష ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారన్నారు. వారు త్రిష ట్విట్టర్‌ను ఓపెన్ చేసి చూస్తున్నారు. వారు త్రిష ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇతరులకు తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం శనివారం ఉదయమే తమకు తెలిసిందని, దీంతో వెంటనే ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను మార్చేసినట్లు చెప్పారు.
ప్రస్తుతం పేట చిత్ర షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉన్న త్రిష తన అభిమానులకు తెలిపిందని అన్నారు. త్రిష ట్విట్టర్ అకౌంట్‌ను ఇంతకు ముందొకసారి అగంతకులు హ్యాక్ చేశారన్నది గమనార్హం. ఆ సమయంలో త్రిష జల్లికట్టుకు మద్దతు తెలపగా ఆమె ట్విట్టర్‌ను హ్యాక్ చేసిన వారు త్రిష గురించి ఇష్టమొచ్చిన విధంగా తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయమై త్రిష పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజా పరిణామాలకు చెన్నైకి తిరిగొచ్చిన తరువాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment