
తమిళసినిమా: నటుడు కమలహాసన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కమలహాసన్ నటించి, నిర్మించిన విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో పలు సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సీక్వెల్‌గా తెరకెక్కించిన విశ్వరూపం–2ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. పలు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ నెల 10వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర విడుదలపై నిషేధం విధించాల్సిందిగా కోరుతూ సాయిమీరా చిత్ర నిర్మాణ సంస్థ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో తమ సంస్థ కమలహాసన్ కథానాయకుడిగా నటించి, కథా, కథనం, దర్శకత్వం బాధ్యతలు వహించే విధంగా మర్మయోగి చిత్రానికి ఆయన సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ సంస్థతో 2008లో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అందుకుగానూ చిత్ర నిర్మాణానికి రూ.6.90కోట్లు ఖర్చు చేసిందన్నారు. కమలహాసన్‌కు అడ్వాన్స్‌గా రూ.4కోట్లు చెల్లించిందన్నారు.
అయితే కమల్ మర్మయోగి చిత్రాన్ని పూర్తి చేయకుండా ఆ డబ్బుతో ఉన్నైపోల్ ఒరువన్ చిత్రం చేసుకున్నారన్నారు. దీంతో తమ డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా కమలహాసన్ విశ్వరూపం–2 చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారన్నారు. తమ డబ్బు తిరిగి చెల్లించే వరకూ విశ్వరూపం–2 చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా కమల్ తరఫు న్యాయవాది రిట్ పిటిషన్‌కు గడువు కోరారు. న్యాయమూర్తి సీవీ. కార్తీకేయన్ ఈ కేసు విషయంలో నటుడు కమలహాసన్,ఆస్కార్ ఫిలింస్ సంస్థలకు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.