
ప్రతిభ, అందం, ప్రొఫెషనలిజం, గ్లామర్ ఇలా అన్నింటిలోనూ టీవీ ఆరిస్టులు కూడా సినిమా వాళ్లకు ఏమాత్రం తీసిపోరని నటి హీనాఖాన్ పేర్కొన్నారు. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన ఆమె ‘లైన్స్’ అనే సినిమా ద్వారా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఫ్రెంచ్ రివెరా నదీ తీరాన జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తొలిసారిగా పాల్గొన్న హీనాఖాన్.. పొడవాటి గౌన్లతో ఎర్ర తివాచీ హొయలొలికించారు. ఇక అక్కడే తన తెరంగేట్రానికి సంబంధించిన లుక్‌ను విడుదల చేసి మరిన్ని మధుర ఙ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్‌లతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఈ సందర్భంగా... ‘వరల్డ్ స్టార్ నుంచి ఊహించని ఆహ్వానం. వావ్. ఇది నిజమేనన్న స్పృహలోకి వచ్చాక అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాను. అక్కడికి తను చేరుకునేదాకా అవుట్ సైడర్‌గానే ఫీలయ్యాను. కానీ తను వచ్చిన తర్వాత వెంటనే నా చేయి పట్టుకుని ఒక్క క్షణం కూడా వదల్లేదు. అక్కడున్న వాళ్లందరికీ పరిచయం చేసింది. బహుశా నా జీవితంలో ఎన్నటికీ వాళ్లను కనీసం దగ్గరి నుంచి కూడా చూసేదాన్ని కాదు. అలాంటి వాళ్లకు నా చిన్నపాటి కెరీర్, టీవీ నుంచి కేన్స్ వరకు చేరుకోవడంలో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పింది. ఇక లైన్స్ అనే సినిమా ద్వారా ప్రతిభకు, ప్రసార మాధ్యమాలకు ఉన్న అంతరాలను చెరిపేసేందుకు సిద్ధమయ్యాను. ఇక నాలాంటి వర్ధమాన నటులను ప్రోత్సహించడంలో తను ఎప్పుడూ ముందే ఉంటుంది’ అంటూ ప్రియాంక చోప్రాపై ప్రశంసల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment