ఆస్కార్‌కు మన ఎంట్రీగా లయర్స్ డైస్ | Hindi film 'Liar's Dice' to represent India at Oscars 2015 | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌కు మన ఎంట్రీగా లయర్స్ డైస్

Published Tue, Sep 23 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

ఆస్కార్‌కు మన ఎంట్రీగా లయర్స్ డైస్

ఆస్కార్‌కు మన ఎంట్రీగా లయర్స్ డైస్

వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో జరిగే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో పోటీ పడేందుకు మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’ (2013) ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన సినీ ప్రముఖులతో నియమించిన 12 మంది సినీ ప్రముఖుల జ్యూరీ మంగళవారం నాడు ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచేందుకు ‘లయ్యర్స్ డైస్’ చిత్రం అర్హమైనదంటూ జాతీయ అవార్డు చిత్రాల దర్శకుడు టి. హరిహరన్ నేతృత్వంలోని జ్యూరీ అభిప్రాయపడింది. మొత్తం 30 భారతీయ చిత్రాలను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా చూసిన జ్యూరీ చివరకు ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఎఫ్.ఎఫ్.ఐ. డిప్యూటీ సెక్రటరీ ప్రకటించారు.
 
 ఎఫ్.ఎఫ్.ఐ. ఉపాధ్యక్షుడైన సి. కల్యాణ్‌కు జ్యూరీ తన సిఫార్సును అందజేసింది. ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రయాణంలో సాగే నాటకీయ ఘట్టాలతో నడుస్తుంది. నగరాలకు వలస పోవడం వల్ల మానవ జీవితంలో తలెత్తిన సంక్షోభాన్ని ఈ చిత్రం ప్రస్తావిస్తుంది. చాలా కాలం క్రితం పని కోసం వెళ్ళిన భర్త కనిపించకుండా పోవడంతో ఓ మారుమూల గ్రామంలోని ఓ యువకురాలైన తల్లి పడే బాధలను ఈ చిత్రం ప్రతిఫలించింది. నవాజుద్దీన్ సిద్దిఖీ, గీతాంజలీ థాపా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులు (ఉత్తమ నటి - గీతాంజలీ థాపా, ఉత్తమ ఛాయాగ్రహణం - రాజీవ్ రవి) అందుకుంది. విమర్శకుల ప్రశంసలందుకొన్న ఈ చిత్రం ఆస్కార్ బరిలో మన ఆశలు పండిస్తుందా అన్నది వేచిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement