Hippi Movie Review, in Telugu | ‘హిప్పీ’ మూవీ రివ్యూ | RX 100 fame Karthikeya - Sakshi
Sakshi News home page

‘హిప్పీ’ మూవీ రివ్యూ

Published Thu, Jun 6 2019 12:59 PM | Last Updated on Thu, Jun 6 2019 1:59 PM

Hippi Telugu Movie review - Sakshi

టైటిల్ : హిప్పీ
జానర్ : రొమాంటిక్‌ కామెడీ
తారాగణం : కార్తికేయ, దిగంగనా సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జజ్బా సింగ్‌, వెన్నెల కిశోర్‌
సంగీతం : నివాస్‌ కే ప్రసన్న
దర్శకత్వం : టీఎన్‌ కృష్ణ
నిర్మాత : కలైపులి ఎస్‌ థాను

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ హిప్పీ. ఆర్‌ఎక్స్‌ 100లో బోల్డ్‌ సీన్స్‌తో రెచ్చిపోయిన కార్తీకేయ హిప్పీలోనూ అదే ఫార్ములా కంటిన్యూ చేశాడు. తమిళ స్టార్ ప్రొడ్యూసర్‌ కలైపులి ఎస్‌ థాను నిర్మాతగా టీఎన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హిప్పీలో ఈ యంగ్‌ హీరో స్టైలిష్‌ మేకోవర్‌తో ఆకట్టుకున్నాడు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? కార్తికేయ తన సక్సెస్‌ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా..?

కథ ;
హిప్పీ దేవదాస్‌ (కార్తికేయ) ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ చేసి మార్షల్‌ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్నేహ (జజ్బా సింగ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్నేహతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు ఆమె ఫ్రెండ్‌ ఆముక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ)ను చూసి తొలి చూపులోనే మళ్లీ ప్రేమలో పడతాడు. స్నేహను కాదని ఆముక్తమాల్యద చుట్టూ తిరుగుతుంటాడు. హిప్పీకి ఇన్నాళ్లు తన మీద ఉన్నది ప్రేమ కాదు ఎట్రాక్షన్ అని అర్థం చేసుకున్న స్నేహ, వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. తరువాత హిప్పీ, ఆముక్తమాల్యదలు దగ్గరవుతారు.

కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలువుతుంది. ఆముక్తమాల్యద తన ఆంక్షలతో హిప్పీకి నరకం చూపిస్తుంది. చెప్పినట్టు వినాలని, చెప్పిన టైంకి రావాలని ఇబ్బంది పెడుతుంది. దీంతో ఎలాగైనా ఆముక్తమాల్యదను వదిలించు కోవాలనుకుంటాడు హిప్పీ. అందుకోసం హిప్పీ ఏం చేశాడు..? చివరకు హిప్పీ, ఆముక్తమాల్యదలు కలిసున్నారా.. విడిపోయారా? అన్నదే మిగతా కథ.


నటీనటులు ;
ఆర్‌ఎక్స్‌ 100లో ఒకే ఎక్స్‌ప్రెషన్‌లో కనిపించిన కార్తికేయకు ఈ సినిమాలో వేరియేషన్స్‌ చూపించే అవకాశం దక్కింది. లుక్స్‌తో పాటు నటనపరంగానూ మంచి మార్కులు సాధించాడు. యాక్షన్‌ సీన్స్‌లో సూపర్బ్ అనిపించాడు. హీరోయిన్‌ దిగంగనా సూర్యవంశీ.. ఆముక్తమాల్యద పాత్రలో ఒదిగిపోయింది. నటనతో పాటు గ్లామర్‌ షోతోను యూత్‌ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. మరో కీలక పాత్రలో నటించిన జేడీ చక్రవర్తి, తన అనుభవంతో అరవింద్‌ పాత్రను అవలీలగా పోషించాడు. వెన్నెల కిశోర్‌ తన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు. ఇతర పాత్రల్లో జజ్బా సింగ్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ ;
హీరో హీరోయిన్లు ప్రేమించుకోవటం, తరువాత విడిపోవటం, తిరిగి కలవటం లాంటి కాన్సెప్ట్‌తో తెలుగు తెర మీద చాలా సినిమాలు వచ్చాయి. అయితే అదే కాన్సెప్ట్‌కు మరింత మసాలా జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు టీఎన్‌ కృష్ణ. తొలి పది నిమిషాల్లోనే జేడీ చక్రవర్తి చెప్పే డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌తో సినిమా ఎవరిని టార్గెట్‌ చేసి రూపొందించారు క్లారిటీ ఇచ్చేశారు. రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలోనూ కాస్త లిమిట్స్‌ క్రాస్‌ చేసిన ఫీలింగ్‌ కలుగుతుంది.

కథ పరంగా బాగానే ఉన్నా కథనం మాత్రం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. కామెడీ బాగానే వర్క్‌ అవుట్ కావటం కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫి బాగుంది. నివాస్‌ కే ప్రసన్నా సంగీతం పరవాలేదు. పాటలు విజువల్‌గా బాగున్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాలా సన్నివేశాలు బోర్‌ ఫీలింగ్‌ కలిగిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
యూత్‌ను ఆకట్టుకునే అంశాలు


మైనస్‌ పాయింట్స్‌ ;
డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌
స్లో నేరేషన్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement