ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా!
‘‘నేను తెలుగులో స్ట్రయిట్ ఫిలిం చేస్తానని చెప్పా. ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమా చేశాను. నన్ను స్టార్ చేసిన తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా చేశాను’’ అని కమల్‌హాసన్ అన్నారు. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శ్రీ గోకులం మూవీస్ సంయుక్తంగా రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో ఎస్. చంద్రహాసన్, కమల్‌హాసన్ నిర్మించిన చిత్రం ‘చీకటి రాజ్యం’. కమల్‌హాసన్, త్రిష, ప్రకాశ్‌రాజ్, మధుశాలిని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, మేకింగ్ వీడియోను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కమల్‌హాసన్ మాట్లాడుతూ - ‘‘నేను నేషనల్ స్టార్‌గా మొదలైంది తెలుగు సినిమాలతోనే.
రికార్డ్స్ పరంగా చెప్పాలంటే తెలుగులోనే నాకు ఎక్కువ ఉన్నాయి. తమి ళ్‌లో కూడా అన్ని రికార్డ్స్ ఉండవు. అందుకే తెలుగులో నేను ఆర్డినరీ సినిమాలు చేయడానికి ఇష్టపడను. ‘చీకటి రాజ్యం’ ఆర్డినరీ సినిమా కాదు. దీన్ని మీరే ఎక్స్‌ట్రార్డినరీ ఫిలిమ్ చేయాలి. వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ ఇది మెమెరబుల్ మూవీ’’ అన్నారు. రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ - ‘‘హాలీవుడ్ శైలిలో ఒకే పాయింట్ మీద సాగే కథతో సినిమా ఉంటుంది. సినిమా మొదలైన పది నిమిషాలకు మన హార్ట్‌బీట్ కూడా పెరుగుతుంది. థ్రిల్లర్ తరహాలో ఉత్కంఠకు గురి చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నటి మధుశాలిని తదితరులు పాల్గొన్నారు.