‘ఆ సీడీ చూడగానే చరణ్ పెద్ద హీరో అవుతాడనుకున్నాం’
‘‘అభిమానులను అలరించడానికి ప్రతి హీరో ప్రతి చిత్రాన్ని కష్టపడి చేస్తారు. లోకువగానో, ఈజీగానో తీసుకోరు. నేనూ అంతే. ఇంత కష్టపడకపోతే తప్పవుతుంది. పైగా, జనవరిలో నాన్నగారి ‘ఖైదీ నంబర్ 150’ వస్తుంది. ఆయన లేని టైమ్‌లో మేము అటూ ఇటూగా ఉన్నా ఫర్వాలేదు. ఆయన వస్తున్నారు కనుక ఇప్పుడింకా క్రమశిక్షణతో ఉంటాం’’ అన్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘ధృవ’. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిగింది. తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
కేటీఆర్ మాట్లాడుతూ - ‘‘నిర్మలమైన, మంచి మనసున్న వ్యక్తి చిరంజీవిగారు. చరణ్ పెంపకంలో అది కనిపిస్తోంది. చరణ్ 9వ చిత్రమిది. ఆయన లక్కీ నంబర్.. కార్ నంబర్... బర్త్‌డే టోటల్ నంబర్ కూడా 9. ‘ధృవ’ కూడా ఈ నెల 9న వస్తోంది. తప్పకుండా హిట్టవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత నేను కూడా ఫిట్ కావాలనుకున్నా. సిక్స్‌ప్యాక్ మన వల్ల కాదు. నాకు రెండు ప్యాక్స్ చాలు’’ అన్నారు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ - ‘‘ఈ వేడుకను విశాఖలో చేస్తామని చరణ్ ప్రామిస్ చేశారు. సక్సెస్ మీట్‌ను విశాఖలో జరపాలి. ‘ఖైదీ నంబర్ 150’ వేడుకనూ అక్కడే జరపాలని కోరుతున్నాం’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘మెగాస్టార్ కొడుకు హీరోగా వస్తే బాగుంటుందనే ఆశ మాకు ఉండేది. చరణ్ పెద్ద హీరో అవుతాడా? లేదా? అని సస్పెన్స్ ఉండేది.
ముంబై ఫిల్మ్ స్కూల్‌కి చరణ్ వెళ్లొచ్చిన తర్వాత.. అందులో చేసిన ఆడిషన్ సీడీని చిరంజీవి గారు చూపించగానే పెద్ద యాక్టర్ అవుతాడనిపించింది’’ అన్నారు. అరవింద్ స్వామి మాట్లాడుతూ - ‘‘కొందరు దర్శకులు ఉన్నది ఉన్నట్టుగా రీమేక్ చేస్తే, ఇంకొందరు మార్పులు చేస్తారు. సురేందర్‌రెడ్డిగారు సరైన మార్పులు చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ల చిన్నప్పుడు నేనెలా ఉన్నానో, ఇప్పుడూ అలానే ఉన్నానని చెప్తున్నారు. రేపు వాళ్ల పిల్లలు పెద్దైన తర్వాత కూడా ఇదే చెప్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘విడుదలైన రోజునే ‘తని ఒరువన్’ చూశా. మర్నాడు చరణ్‌కి ఫోన్ చేసి సినిమా చూడమని చెప్పా. చూసిన తర్వాత చేస్తానని చెప్పారు’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మనకు కనపడే చరణ్ వేరు, ఆయన హృదయం వేరు.
ఈ సినిమా ద్వారా మంచి హీరో, స్నేహితుడు దొరికాడని గర్వంగా చెప్పుకోవచ్చు. చరణ్ ఇష్టపడి, తను కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను సెలెక్ట్ చేసుకుని నాకు ఇచ్చారు’’ అన్నారు. దర్శకులు వీవీ వినాయక్, బోయపాటి శ్రీను, సుకుమార్, వంశీ పైడిపల్లి, పరశురామ్, మారుతి, హీరోలు రానా, నవదీప్, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ (ఆది) పాల్గొన్నారు.