
ముంబై : బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. హృతిక్ తాత, లెజెండరీ ఫిల్మ్ మేకర్ జే. ఓం ప్రకాష్ బుధవారం కన్నుమూశారు. 93 సంవత్సరాల ఓం ప్రకాష్ భగవాన్ దాదా, ఆప్ కే సాథ్, ఆఖిర్ క్యోం, అర్పణ్, ఆస్‌పాస్, ఆశ, ఆక్రమణ్, ఆప్ కీ కసమ్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆంధీ, ఆంఖో ఆంఖో మే, ఆయా సవాన్ ఝూమ్ కే వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ఓం ప్రకాష్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
కాగా కొద్దిరోజుల కిందట తాతతో తన ఫోటోలను హృతిక్ రోషన్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ తాత తన సూపర్ టీచర్ అని, జీవితంలో ప్రతి దశలోనూ ఆయన ఎలా ఉండాలో తనకు పాఠాలు నేర్పించారని బలహీనతలను అధిగమించేలా తనను రాటుదేల్చారని పేర్కొన్నారు. గత ఏడాది ఓం ప్రకాష్ 92వ జన్మదినం సందర్భంగా హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోనూ ఆయన గురించి పలు వివరాలు వెల్లడించారు. యువకుడిగా ఉన్న దశలో తన తాత పుస్తకాలు కొనుక్కునేందుకు వెడ్డింగ్ రింగ్‌ను అమ్మేశారని చెప్పుకొచ్చారు. వీధిదీపాల కింద చదువుకుని సృజనాత్మకత ఆలంబనగా సినిమాల్లో ప్రవేశించారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment