రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదు
ముంబై: వివాదాస్పద ట్వీట్లతో తరచు వార్తలో నిలిచే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, రాజకీయాల్లోకి రానని తేల్చిచెప్పారు. తాను కోట్లాది మంది భారతీయులకు ప్రతినిధిగా ఉంటానని చెప్పారు. ఈస్ట్ ఆర్ వెస్ట్.. ఇండియా ఈజ్ బెస్ట్ అని నమ్మే భారతీయుల తరఫున తన వాదనను వినిపిస్తాను తప్ప రాజకీయాల్లోకి రానన్నారు. సోషల్ మీడియాలో అభిమానులతో, స్నేహితులతో ఆయన సరదాగా చాట్ చేసినపుడు.. మీ భార్య కిరణ్‌లా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నలకు ఆయన ఇలా స్పందించారు. మీ భార్య అడుగు జాడల్లో నడుస్తారా అన్న నెటిజన్ల ప్రశ్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లో చేరనని, నటుడిగా, స్ఫూర్తిమంతమైన ఉపన్యాసకుడిగా ఉండటమే తనకు సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. పరమత సహనం కోరుతూ ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని ప్రకటించిన ఖేర్ తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి.
అయితే ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న అనుపమ్ భార్య కిరణ్ ఖేర్.. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా సల్మాన్ సెన్సేనషనల్ మూవీ 'ప్రేమ రతన్ ధన్ పాయో'లో నటించిన అనుపమ్.. క్రికెటర్ ధోనీపై రూపొందుతున్న చిత్రం 'ఎమ్ఎస్ ధోనీ' లో ధోనీ తండ్రి పాన్ సింగ్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.