
వర్మ, పూరిలతో సినిమాలు చేయబోతున్నాను
‘‘పోటీకి వెళ్లేటప్పుడు ఎవరైనా గెలవాలనే వెళతాం. కాకపోతే, సినిమా పరిశ్రమలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది’’ అంటున్నారు విష్ణు. నేడు ఆయన పుట్టినరోజు. మూడు పదుల వయసులో ఉన్న విష్ణు తనకు మాత్రం ఇది రెండో పుట్టినరోజు అంటున్నారు. దానికి కారణం చెబుతూ - ‘‘నా జీవితం ఇప్పుడే ప్రారంభమైనట్లుగా ఉంది. దానికి కారణం నా ఇద్దరు కూతుళ్లు ఆరియానా, వివియానా నా లైఫ్‌లోకి వచ్చిన ఈ రెండేళ్లల్లో ఎన్నో మంచి మార్పులు రావడమే. ఇప్పుడిప్పుడే వాళ్లకి మాటలొస్తున్నాయి.
అందుకని, ‘హ్యాపీ బర్త్‌డే నాన్నా’ అంటారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక, నా జీవితంలోకి వినీ (విరానికా) వచ్చిన తర్వాత చాలా మంచి మలుపులు వచ్చాయి. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా అంటూ వరుసగా నా సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే నా మార్కెట్ బాగా పెరిగింది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు విష్ణు. ప్రస్తుతం చేస్తున్న ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ గురించి చెబుతూ -‘‘నాన్నగారు, నేను, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ చేస్తున్న పక్కా మల్టీస్టారర్ మూవీ. అందరూ అనుకుంటున్నట్లు ఇందులో నాన్న, నేను, తమ్ముడు అన్నదమ్ములుగా యాక్ట్ చేయడంలేదు. ఆ ఇద్దరికీ నేను యాంటీగా ఉంటాను. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట? అనే ప్రశ్నకు -‘‘అవును. ‘నీలో మంచి కామెడీ టింజ్ ఉంది.
ఒక మాస్ హీరోలో కామెడీ టింజ్ ఉండటం గొప్ప విషయం. నేను దాన్ని కాప్చర్ చేయాలనుకుంటున్నాను’ అని చెప్పారు వర్మగారు. సో... ఓ డిఫరెంట్ మూవీ చేయబోతున్నాం. అలాగే పూరీ జగన్నాథ్‌గారి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. మొదట్లో బొద్దుగా ఉండేవారు కదా... మరి ఎలా స్లిమ్ అయ్యారు? అనడిగితే -‘‘చాలామంది అమెరికా నుంచి కోచ్‌లను తెప్పించుకుంటారు. కానీ, దిల్‌సుఖ్‌నగర్‌లో సంపత్ అని నాలుగు జిమ్‌లున్న కోచ్ ఉన్నారు. ఈరోజు నా ఫిజిక్ ఇలా ఉందంటే దానికి కారణం ఆయనే. ఇది 30 శాతమే. ఇంకా మార్పు చూస్తారు’’ అన్నారు.