కడుపు నింపుకోడానికే పనిచేస్తున్నా: అమితాబ్
ఏడు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఆయన్ను చూసే సినిమాలు ఆడిస్తున్నారు. తెల్లటి జుట్టుతో ఆరడుగులకు పైగా పొడవుండి.. ఇప్పటికీ తనదైన స్టైలుతో బాలీవుడ్‌ను అల్లాడిస్తున్న వ్యక్తి అమితాబ్ బచ్చన్. తాజాగా ఆయన నటించిన పింక్ సినిమాపై విమర్శకుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే ఏకంగా ఐదుకు ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చేశారు. ఇంత జరిగినా.. ఆయన మాత్రం ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్న సూత్రాన్ని బాగా పాటిస్తున్నారు. తాను కడుపు నింపుకోవాలి కాబట్టి సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. మీ విజయ రహస్యం ఏంటని అడిగినా కూడా.. ''నేను ప్రతిరోజూ ఉదయాన్నే లేస్తాను.. ఏదో ఒక సినిమాలో నటిస్తూ ఉంటాను. నేను కడుపు నింపుకోవాలి కాబట్టి మాత్రమే పనిచేస్తున్నాను. మీరు కూడా అందుకే కదా.. ఉద్యోగాలు చేసేది'' అని ఆయన మీడియాతో అన్నారు. ఇండియా టుడే మైండ్ రాక్స్ యువజన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు. తనకు స్ఫూర్తినిచ్చిన మహిళ తన తల్లేనని, ఆమె సిక్కు మహిళ అని.. అందుకే తాను సగం సర్దార్‌నని చెప్పారు. ఆమె తనకు చాలా శక్తినిచ్చిందని తెలిపారు. తాను ఒకరోజు ఇంటి వెనక ఆడుకుంటుంటే కొందరు పిల్లలు వచ్చి తనను కొట్టారని, తాను ఏడుస్తూ ఇంట్లోకి వెళ్తే, తన తల్లి వెళ్లి వాళ్లను తిరిగి కొట్టమని ధైర్యం చెప్పారని.. దాంతో తాను వెళ్లి కొట్టానని అమితాబ్ చెప్పారు.
పింక్ సినిమాలో అమితాబ్‌తో పాటు కలిసి నటించిన తాప్సీ, నిర్మాత షూజిత్ సర్కార్.. ఇలా ప్రతి ఒక్కరూ అమితాబ్‌ను ఆరాధనా భావంతో చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండి కూడా ఆయన ఏ విషయాన్నీ ఊరికే వదిలేయరని, సెట్లలో ఆయన చూపించే అంకిత భావం, పడే శ్రమ చూస్తుంటే అందుకే ఆయన ఇంత స్థాయిలో ఉన్నారని సర్కార్ అన్నారు.