నేను ప్రేమిస్తున్నాను: సోనాక్షి సిన్హా
బాలీవుడ్ ముద్దు గుమ్మ సోనాక్షి సిన్హా మీడియాను బుల్లి బుల్లి మాటలతో బాగానే బోల్తా కొట్టించడం నేర్చుకుంటోంది. సినీ పరిశ్రమతో తనకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని సోనాక్షి చక్కగా వినియోగించుకుంటోంది. ఇటీవల 'ఆర్ రాజ్ కుమార్' చిత్ర ప్రమోషన్ కోసం ఓ టెలివిజన్ చానెల్ నిర్వహిస్తున్న కామెడీ నైట్.. అనే కార్యక్రమంలో దర్శకుడు ప్రభుదేవా, బాలీవుడ్ నటులు షాహీద్ కపూర్, సోన్ సూద్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో 'ఎవరితో ప్రేమలో పడ్డారా' అని హోస్ట్ కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు తల ఊపడమేకాకుండా.. నేను ప్రేమిస్తున్నాను అని సోనాక్షి చెప్పడంతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అయితే నీవు ప్రేమిస్తున్నది ఎవరూ అని హోస్ట్ పదే పదే అడుగగా.. అందుకు ఊరిస్తూ ప్రస్తుతం పనిని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో ప్రేక్షకులతోపాటు అక్కడున్న అందర్ని నవ్వుల్లో ముంచింది. తండ్రి 'షాట్ గన్' శతృఘ్న సిన్హా ట్రైనింగ్ సోనాక్షికి బాగానే ఉపయోగపడుతున్నట్టు కనిపిస్తోంది.