
ప్రత్యేక గీతాల్లో నటించను: శ్యామల
ప్రత్యేక గీతాల్లో నటించే ఉద్దేశం తనకు లేదని టీవీ వ్యాఖ్యాత, నటి శ్యామల అన్నారు. బెస్ట్ యాంకర్ల జాబితాలో తన పేరు ఉండాలన్న కోరికను ఆమె వ్యక్తపరిచారు. లౌక్యం, ఒక లైలా కోసం సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి గుర్తింపు రావడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. అయితే సినిమాల కోసం టీవీ షోలు వదులుకోబోనని స్పష్టం చేశారు.
సినిమాల్లో ప్రత్యేక గీతాలు చేసే అవకాశం వచ్చిన వార్తలపై శ్యామల స్పందించారు. ప్రస్తుతం ప్రత్యేక గీతాల్లో నటించే ఉద్దేశం తనకు లేదన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర కావాలన్నదే తన లక్ష్యమన్నారు.
కర్ణాటకకు చెందిన శ్యామల తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. అయితే దీనికోసం తాను ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని చెప్పారు. చిన్నప్పుడు పరిషత్ నాటకాల్లో నటించానని వెల్లడించారు. ఓ తెలుగు నాటకంలో ఉత్తమ బాలనటిగా అవార్డు కూడా అందుకున్నానని కూడా తెలిపారు.
అభిషేకం, లయ, హ్యేపీ డేస్ సీరియల్స్ లో నటించిన శ్యామలకు 18 ఏళ్ల వయసులో పెళ్లైంది. భర్త, అత్తింటివారు అండగా నిలవడం వల్లే కెరీర్ ఆటంకం లేకుండా ముందుకుసాగుతోందని తెలిపారు.