
బాహుబలి సినిమా ఇంకా చూడలేదు: హీరో
ఇప్పటికే 1500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన బాహుబలి-2 సినిమాను బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఇంతవరకు చూడలేదట! ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా చైనాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్కడ ఇంగ్లీషు కాకుండా వేరే సినిమాలలో రూ. 750 కోట్ల వసూళ్లు దాటిన మొట్టమొదటి సినిమాగా ఇది నిలిచింది. వీటి పుణ్యమాని దేశంలో వెయ్యికోట్ల వసూళ్లు దాటిన రెండో సినిమాగా దంగల్ రికార్డులకెక్కింది. మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి -2 సినిమా ఇప్పటికే 1500 కోట్లు దాటేసింది.
దీన్ని కూడా చైనాలో విడుదల చేసేందుకు సినిమా వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటివరకు ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు గానీ, వీలైనంత త్వరలోనే దాన్ని విడుదల చేసి, మానియాను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాలకు పోలిక లేదని మిస్టర్ పెర్ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ అంటున్నాడు. దంగల్ సినిమా ఒకరకం అయితే బాహుబలి మరో రకం అని, ఈ రెండూ భారతీయ సినిమాలే కావడం, రెండూ బ్రహ్మాండమైన విజయాలు సాధించడం మాత్రం గర్వకారణంగా ఉందని చెప్పాడు. బాహుబలి సినిమాను చూసి తాను ఎంతో గర్వపడుతున్నానన్నాడు. తాను ఇంతవరకు ఆ సినిమా చూడలేదు గానీ, దాని గురించి చాలా బాగా విన్నానని చెప్పాడు. రాజమౌళితో పాటు మొత్తం బాహుబలి టీమ్‌ను అభినందిస్తున్నానని అన్నాడు.