చిన్న సినిమాలకు దూరం కాను!
‘‘పని ఒత్తిడి అనే మాట నా నిఘంటువులో లేదు. ఎంతో ఇష్టంగా పని చేస్తా. షూటింగ్ లేని సమయాల్లో కథలు రాస్తుంటాను. పని చేయడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది’’ అంటున్నారు మారుతి. ఇటీవల విడుదలైన ‘కొత్త జంట’ దర్శకునిగా తన ప్రతిష్ట పెంచిందని మారుతి వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ - ‘‘యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు చూడాలనే ఆకాంక్షతో చేసిన సినిమా ఇది. నా ఆశయం నెరవేరింది. విడుదలకు ముందు ఈ సినిమా రామ్‌చరణ్ చూసి, ‘చాలా తెలివిగా తీశావు’ అన్నాడు. బన్నీకి కూడా నచ్చింది. ‘రాధ’ కథ ఆలస్యం అవుతున్నందువల్లే వెంకటేశ్ ‘దృశ్యం’ ఒప్పుకున్నారని ఈ సందర్భంగా మారుతి పేర్కొన్నారు. డీవీవీ దానయ్య సంస్థలో ఓ సినిమా చేస్తాననీ, రవితేజ, నాగచైతన్య, సునీల్ తదితరులకు కూడా కథలు సిద్ధం చేస్తున్నానని చెప్పారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కోటి, రెండు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో చిన్న సినిమాలు కూడా చేస్తానని, చిన్న సినిమాలకు ఎప్పటికీ దూరం కానని మారుతి స్పష్టం చేశారు.