విడుదలైన ప్రతి సినిమా చూస్తాను.. తెలుసుకుంటాను.. నేర్చుకుంటాను!
- దాసరి
‘‘విజయం సాధించిన సినిమాను... ఎందుకు విజయం సాధించిందో తెలుసుకోవడానికి చూస్తాను. ఫ్లాప్ సినిమా అయితే... జనానికి ఎందుకు నచ్చలేదో తెలుసుకుంటాను. అలా విడుదలైన ప్రతి సినిమా చూస్తాను. సాంకేతికంగా కొత్తగా ఏముందో గమనిస్తాను. తమిళం, మలయాళం సినిమాలు ఎక్కువగా చూస్తా. ముఖ్యంగా కుటుంబ కథల్ని ఇష్టపడతా. ఇంగ్లిష్ సినిమాలను అస్సలు చూడను. అందుకే.. వాటి ప్రభావం నాపై కనిపించదు. సమాజంలోని వ్యక్తులే... నా సినిమాల్లోని పాత్రల్లో కనిపిస్తారు.
అంతటి పరిశీలాత్మక దృష్టి ఉంది కాబట్టే ఇంత అడ్వాన్స్‌గా ఉండగలుగుతున్నా’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘ఎర్రబస్సు’. దాసరి, మంచు విష్ణు ఇందులో తాతామనవళ్లుగా నటించారు. కేథరిన్ కథానాయిక. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లోని దాసరి స్వగృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు దాసరి చలాకీగా సమాధానాలిచ్చారు.
చక్రి అద్భుతమైన సంగీతం అందించాడనీ, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణమనీ, ఆల్బ మ్‌లోని ఆరుపాటలూ విజయాన్ని సాధించడం చాలాకాలం తర్వాత ఈ సినిమాకే జరిగిందని దాసరి ఆనందం వెలిబుచ్చారు. తండ్రిలోని క్రమశిక్షణను విష్ణు చక్కగా ఒంటబట్టించుకున్నాడనీ, అయితే... మోహన్‌బాబు స్థాయి నటునిగా ఎదగడానికి విష్ణు ఎంతో శ్రమించాలని దాసరి అభిప్రాయపడ్డారు. ప్రతిభను గుర్తించే శక్తి ఆ దైవం వల్లే తనకు లభించి ఉంటుందనీ, ఈ సినిమాకు పనిచేసిన అందరికీ మంచి పేరు రావాలనీ దాసరి ఆకాంక్షించారు.
విశ్వవిద్యాలయం లాంటి దాసరిగారి దర్శకత్వంలో నటించే అవకాశం ఇంత త్వరగా రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, ఆయన ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాననీ మంచు విష్ణు చెప్పారు. గతించిన తన తండ్రిని దాసరిగారిలో చూసుకుంటున్నాననీ, ఆయనతో పనిచేసే భాగ్యాన్ని అందించిన ‘ఎర్రబస్సు’ చిత్రాన్ని మరిచిపోలేననీ సంగీత దర్శకుడు చక్రి అన్నారు. చిత్రయూనిట్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.