నాన్‌స్టాప్‌గా ఎర్రబస్సు!
కల్లాకపటం లేకుండా, అమాయకంగా మాట్లాడే పల్లెటూరి వ్యక్తిని చూస్తే ‘వీడెవడ్రా.. ఇప్పుడే ఎర్రబస్సు దిగినట్టున్నాడు?’ అనే కామెంట్లు వినిపిస్తాయి. ‘ఏరా ఎర్రబస్సు’.. అని నిక్‌నేమ్ పెట్టేసి మరీ పిలుస్తుంటారు. అలా పల్లె నుంచి నగరానికొచ్చిన ఓ అమాయకపు పెద్దాయనగా దాసరి నారాయణరావు కనిపించనున్నారు. సినిమా పేరు ‘ఎర్రబస్సు’... కథకు తగ్గట్టుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేశారు దాసరి.
తమిళ చిత్రం ‘మంజా పై’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తారకప్రభు ఫిలింస్ పతాకంపై దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ తాత, మనవళ్ల కథలో.. తాతగా దాసరి, మనవడిగా మంచు విష్ణు నటిస్తుండటం విశేషం. దర్శకునిగా దాసరికి ఇది 151వ చిత్రం. నేడు ఈ చిత్రం ప్రారంభమైంది. విష్ణు, కేథరిన్ పాల్గొనగా లహరి గార్డెన్స్‌లో పాట చిత్రీకరిస్తున్నారు. అనంతరం జంట నగరాల్లోని పలు లొకేషన్స్‌లో షెడ్యూల్స్‌ని ప్లాన్ చేశారు.
చిత్రవిశేషాలను దాసరి తెలియజేస్తే-‘‘అరవై రోజులు ఏకధాటిగా జరిపే షూటింగ్‌తో ఈ చిత్రం పూర్తవుతుంది. అన్ని భాషలవారికీ, అన్ని వయసుల వారికీ నచ్చే కథ ఇది. భావోద్వేగాలకు ఈ కథలో పెద్దపీట వేయడం జరిగింది. వాస్తవానికి అద్దం పట్టేలా పాత్రలుంటాయి’’ అని చెప్పారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కృష్ణుడు, రఘుబాబు, కాశీవిశ్వనాథ్, బేబీ నిరాజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: అంజి.