Erra Bassu
-
ఇప్పుడు చాలామంది కథల కోసం ఆకాశానికి, సముద్ర లోతులకు వెళ్తున్నారు!
ఎర్రబస్సు నుంచి ఎయిర్ బస్సు వరకూ... గల్లీ నుంచి ఢిల్లీ వరకూ... నథింగ్ నుంచి ఎవ్రీథింగ్గా... ఎదిగిన ప్రస్థానం దాసరిది. ఆయన ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రే ఉండదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 151వ సినిమా ‘ఎర్రబస్సు’. దాసరి, మంచు విష్ణు తాతా, మనవళ్లుగా నటించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దాసరితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ♦ మొదటిసారి ఎర్రబస్సు ఎప్పుడెక్కారో ఓసారి గుర్తు చేసుకుంటారా? ఏలూరులోని ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫీసులో నా పేరు నమోదు చేయించుకోవడానికి పాలకొల్లులో మొదటిసారి ఎర్ర బస్సెక్కాను. ఆ తర్వాత ఉద్యోగాన్వేషణలో భాగంగా ఎర్రబస్సెక్కి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు భాగ్యనగరంలో నా ప్రయాణాలు సాగింది ఎర్రబస్సులోనే. సో.. ఎర్రబస్ అని కొంతమంది తేలికగా తీసిపారేస్తారు కానీ, ఆ బస్సెక్కినవాళ్లూ పైకొస్తారనడానికి మీరో ఉదాహరణ అన్నమాట? ఎర్ర బస్సుని తేలికగా తీసిపారేయకూడదు. ఎంతోమంది మహామహులు ఎక్కిన బస్ అది. అందుకే, ఈ సినిమాలో ‘ఎర్రబస్సని అంత తేలికగా మాట్లాడకండి.. ఎర్రబస్సు ఎక్కొచ్చినోళ్లు ఢిల్లీలోని ఎర్రకోట మీద జెండా ఎగరేశారు’ అని డైలాగ్ కూడా పెట్టాను. ♦ అప్పట్లో ఎర్ర బస్సులో మొదలైన మీ ప్రయాణం ఎయిర్ బస్ వరకూ వస్తుందని ఊహించారా? అస్సలు లేదు. ఈ జీవితం ఆ దేవుడిచ్చిన వరం. చదువుకోవడానికి చాలా అవస్థలు పడినవాణ్ణి. పాలకొల్లు రోడ్ల మీద భుజం మీద అరటిపళ్ల కావిడేసుకుని, ‘అరటి పళ్లోయ్.. అరటి పళ్లోయ్..’ అని అమ్ముకున్న రోజులు నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడున్న జీవితాన్ని నేనేప్పుడూ ఊహించలేదు. కేవలం నాటకాలు వేయడం, రాయడం అనే నా వ్యాపకం నన్నింతటివాణ్ణి చేసింది. టైప్ రైటింగ్ హయ్యర్లో నేను గోల్డ్ మెడలిస్ట్‌ని. షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. అది కానీ, నేను పుచ్చుకున్న డిగ్రీ పట్టా కానీ.. నన్నీ స్థాయికి తీసుకురాలేదు. నాటకాల మీద ఉన్న ఆసక్తే నా ప్రయాణాన్ని ఇంతవరకూ తీసుకొచ్చింది. ♦ 150 సినిమాలకు దర్శకత్వం వహించడమంటే మాటలు కాదు.. ఇప్పుడు కథలు దొరక్క, సినిమాలు తీయడంలేదని చాలామంది అంటున్నారు. అసలు మీకు 150 కథలు ఎలా పుట్టాయి? మంచి ప్రశ్న. కథల కోసం ఇప్పుడు చాలామంది ఆకాశానికి, సముద్ర లోతులకు వెళుతున్నారు. కానీ, కథలు అక్కడ పుట్టవు. మన విలేజ్‌లో, టౌన్లో, వీధిలో, ఎదురింట్లో, పక్కింట్లో ఎన్నో పాత్రలుంటాయి. అన్ని పాత్రలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తే, అందులోంచి కథ పుడుతుంది. నా సినిమా కథలన్నీ జీవితంలోంచి పుట్టుకొచ్చినవే. అందుకే, ఎక్కువ శాతం విజయాలున్నాయి. నా సినిమాల్లోని ఆచారి, పోలీస్ వెంకటేశం, సూరిగాడు, మావగారు.. ఈ పాత్రలు జీవితంలో ఎక్కడోచోట తారసపడతాయి. అందుకే, ఆ పాత్రలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ♦ ప్రస్తుతం ‘హీరో వర్షిప్’ ట్రెండ్ నడుస్తోంది కదా.. ‘ఎర్రబస్సు’ చిత్రం అందుకు భిన్నంగా ఉంటుందేమో? మళ్లీ మనకిలాంటి సినిమాలు రావాలి అని ‘ఎర్రబస్సు’ చూసినవాళ్లు అంటారు. హీరోల మీద కథలు రావడం తప్పు కాదు. కానీ, హీరోల కుటుంబాల గురించి, వంశాల గురించి మాట్లాడటం ఎక్కువైంది. దానివల్ల సినిమా అనే ఫీల్ పోయింది. తాతా, మనవళ్ల కథలెప్పుడూ బాగుంటాయి. తల్లీతండ్రి మందలిస్తే పిల్లలొచ్చి చెప్పుకునేది తాత దగ్గరే. తమకేదైనా కావాలంటే... తాతతో రికమండ్ చేయించుకుంటారు. ఇవన్నీ ఎంత బాగుంటాయో చెప్పక్కర్లేదు. ఇది యువతరానికి కనెక్ట్ అయ్యే సినిమా. మానవీయ విలువలున్న చిత్రం. ♦ నీరాజిత బాగా యాక్ట్ చేసింది నీరాజిత అల్లరి పిల్ల. వాళ్ల అమ్మ హోమ్‌వర్క్ చేయమంటే సెలైంట్‌గా నా దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. నా దగ్గర ఉన్నప్పుడు పిలవరు కదా. అది తన ఐడియా. కానీ, ఆ తర్వాత ఎప్పటికో నాకు తెలుస్తుంది తను హోమ్‌వర్క్ రాయలేదని. అమ్మా, నాన్న తిడితే.. వచ్చేది నా ఒళ్లోకే. చాక్లెట్ తినొద్దని వాళ్ల అమ్మ అంటే.. ఆ చాక్లెట్ కోసం నా దగ్గరకు వస్తుంది. నీరాజిత నాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మర్చిపోలేని అనుభూతి. బాగా యాక్ట్ చేసింది. ♦ మీ ఆన్‌స్క్రీన్ మనవడు విష్ణు గురించి? తమిళ చిత్రం ‘మంజ పై’ చూడగానే మా ఇద్దరికీ నప్పే కథ ఇదనిపించింది. మన తెలుగు నవలల్లో.. ఉదాహరణకు యద్దనపూడి సులోచనారాణి నవలల్లో హీరో ఉంటాడే.. విష్ణు అచ్చంగా అలాంటి హీరోనే. అమెరికాలో స్థిరపడాలనుకునే కుర్రాడి కథ ఇది. అందుకు మూడు నెలల సమయం ఉండటంతో తాతను నగరానికి పిలిపించి, ఆ మూడు నెలలు ఆనందంగా ఉంచాలనుకుంటాడు. తాత కావాలి.. ప్రేయసి కావాలి. తాత కోసం ఇక్కడ ఉండాలా? ప్రేయసి కోసం అమెరికా వెళ్లాలా? అని మదనపడే కుర్రాడిగా బాగా నటించాడు. ♦ ఇది మీకు 151వ సినిమా. విదేశాల్లో విడుదలవుతున్న మీ తొలి సినిమా ఇదే.. ఎలా అనిపిస్తోంది? 151 చిత్రాలు తీసినా.. నా ప్రతి సినిమా నాకు తొలి సినిమానే. అప్పట్లో తెలుగు సినిమాలు విదేశాల్లో విడుదలయ్యేవి కావు. ఆ ట్రెండ్ మొదలైన తర్వాత యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా అక్కడ విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో నా సినిమా విదేశాలకు వెళ్లలేదు. ఇప్పుడు వెళుతున్నందుకు ఉద్వేగంగా ఉంది. అమెరికాలో ఈ సినిమాకి ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే, అక్కడుంటున్న మనవాళ్లు మన సంస్కృతీ, సంప్రదాయాలను, పల్లెటూళ్లను మర్చిపోలేదు. అందుకని అక్కడి వాళ్లకి కూడా బాగా నచ్చుతుంది. ♦ మీరు ‘తాత-మనవడు’ తీసినప్పుడు తాత కాలేదు.. కానీ, ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్లతో సంపూర్ణ జీవితం అనుభవిస్తున్నారు.. అది వెండితెరపై ప్రతిబింబిస్తుందనుకోవచ్చా? కచ్చితంగా. తాతను అయ్యాను కాబట్టే, ‘ఎర్రబస్సు’ని బాగా తీయగలిగాను. నిజజీవితంలో నా మనవళ్లు, మనవరాళ్లు ఏదైనాసరే నా దగ్గర చెప్పుకుంటారు. వాళ్లు పుట్టకముందు ఈ సినిమా తీసి ఉంటే.. కొంచెం అవాస్తవంగా తీసి ఉండేవాణ్ణేమో. కానీ, ఇప్పుడు చాలా సహజంగా తీశాను. మనవడో, మనవరాలో ఏడుస్తుంటే ఓ తాత మనసు ఎలా కదులుతుందో నాకు తెలుసు. అందుకని, నిజంగానే తాతలానే ఫీలై, చేశాను. ♦ ‘తాత-మనవడు’ తీసినప్పుడు మీకు తాత అనుభవం లేదు కదా.. మరి అదెలా తీశారు? పరిశీలనా దృష్టి వల్లే తీయగలిగాను. అప్పటికి మా తాతలను, ఇంటి పక్క తాతలను చూసి ఉన్నాను కాబట్టి, ఆ అనుభవంతో తెరకెక్కించాను. కానీ, ‘ఎర్రబస్సు’లో తాతగా ఒదిగిపోవాలి కాబట్టి, స్వీయానుభవం అవసరం. ♦ ప్రస్తుత సినిమాల్లో పంచ్ డైలాగులు, ప్రాసలు ఎక్కువగా ఉంటున్నాయి.. మరి.. ఈ సినిమాలో? ఇప్పుడు పంచ్ డైలాగ్స్, ప్రాసల ట్రెండ్ నడుస్తోందన్నది చాలా మంది ఊహ. ఇది ఉంటేనే సినిమా ఆడుతుందని చెప్పడానికి ప్రత్యేకంగా పెద్ద బాలశిక్ష లేదు. కామెడీ సినిమా ఆడితే.. ఆ తరహా, యాక్షన్ అంటే.. ఆ రూట్లో వెళ్లిపోతున్నారు. మూడు రోజుల్లో వసూళ్లు రాబట్టాలంటే.. మన సినిమాలో ఏయే అంశాలుండాలని ఆలోచిస్తున్నారు తప్ప లాంగ్ స్టాండింగ్ కోసం చూడటంలేదు. ‘ఎర్ర బస్సు’లో ఏది ఉన్నా కథానుసారంగానే ఉంటుంది తప్ప, ట్రెండ్ అంటూ నేల విడిచి సాము చేయలేదు. - డి.జి. భవాని -
రయ్.. రయ్‌మంటూ...
దాసరి ఏ సినిమా చేసినా... తొలి ప్రాధాన్యత కథకే. ఇప్పటికి 150 చిత్రాలను వెండితెరకు అందించిన ఈ దర్శక దిగ్గజం... 151వ ప్రయత్నంగా రీమేక్‌ని ఎంచుకోవడం విశేషం. తమిళంలో ఘనవిజయాన్ని అందుకున్న ‘మంజా పై’ చిత్రం ఆధారంగా ‘ఎర్రబస్సు’ చిత్రాన్ని రయ్ రయ్ మంటూ రెడీ చేశారు దాసరి. పేరులోనే భిన్నత్వాన్ని ప్రదర్శించిన ఆయన... సినిమా పరంగా ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసుకోవాలంటే... ఈ నెల 14 దాకా ఆగాల్సిందే. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘యు’ సర్టిఫికెట్ లభించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో యు సర్టిఫికెట్ అందుకున్న 90వ చిత్రం ఇది. ఇందులో దాసరి, మంచు విష్ణు తాతామనవళ్లుగా నటించారు. తాతకు హైదరాబాద్ అంతా తిప్పి చూపించాలని ఆశించే మనవడికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది ఈ చిత్ర కథాంశం. కేథరిన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కృష్ణుడు, రఘుబాబు, బేబీ నిరాజిత ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: అంజి, నిర్మాణం: తారకప్రభు ఫిలింస్. -
విష్ణులో నాకు శోభన్‌బాబు కనిపిస్తాడు : దాసరి
‘‘విష్ణులో అందరికీ యాక్షన్ హీరో కనిపిస్తే, నాకు మాత్రం శోభన్‌బాబు కనిపిస్తాడు. అతను ఎంత మంచి నటుడో ఈ చిత్రం నిరూపిస్తుంది. నాతో పోటీ పడి మరీ విష్ణు నటించాడు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘ఎర్రబస్సు’. మంచు విష్ణు కథానాయకుడు. కేథరిన్ కథానాయిక. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మోహన్‌బాబు పాటల సీడీని ఆవిష్కరించి, సీనియర్ నిర్మాత కె.రాఘవకు అందించారు. ఇ.వి.వి.కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి పదివేల నూట పదహారు రూపాయలకు ఆడియో సీడీని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ -‘‘తమిళ చిత్రం ‘మంజప్పై’కి ఇది రీమేక్. తాతా మనవళ్లుగా ఇందులో నేనూ, విష్ణు నటించాం. పతాక సన్నివేశాల్లో విష్ణు నటన కంటనీరు తెప్పిస్తుంది. చక్రి వినసొంపైన గీతాలు అందించాడు. ‘ఐస్‌క్రీమ్’ ఫేమ్ అంజి కెమెరా పనితనం అద్భుతం. ఇక బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రానికి హైలైట్. తప్పకుండా నా బ్లాక్‌బస్టర్స్‌లో ‘ఎర్రబస్సు’ కూడా ఒకటవుతుంది’’ అని చెప్పారు. కుమారుడు అరుణ్‌కుమార్ రూపంలో ఇంట్లోనే ఓ హీరో ఉండగా, విష్ణుకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన నా గురువు, దైవం దాసరిగారికి కృతజ్ఞతలని మోహన్‌బాబు పేర్కొన్నారు. దాసరి విజయవంతమైన చిత్రాల్లో ‘ఎర్రబస్సు’ కూడా ఒకటిగా నిలవాలని కృష్ణ, విజయనిర్మల ఆకాంక్షించారు. ‘ఎర్రబస్సు’తో 151వ చిత్రం చేస్తున్న దాసరి, త్వరలోనే దర్శకునిగా 200 చిత్రాలు పూర్తి చేయాలని కృష్ణంరాజు అభిలషించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్లు సినీరంగంలో స్టార్డమ్ అనేదాన్ని క్రియేట్ చేస్తే, దర్శకులకు స్టార్డమ్ తెచ్చిన ఘనత దాసరిదేనని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కొనియాడారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు కె.రాఘవేంద్రరావు, జమున, జయసుధ, గీతాంజలి, గిరిబాబు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
ఎర్రబస్సు వర్కింగ్ స్టిల్స్
-
ఎర్రబస్సు మూవీ స్టిల్స్
-
తాతా మనవళ్ళ కథ
‘‘పల్లెటూళ్లో పుట్టి పెరిగి నిరక్షరాస్యుడైన ఓ తాత, అమెరికాలో స్థిరపడాలని ఆరాటపడే ఓ మనవడి మధ్య జరిగే కథ ఇది. నాకు, విష్ణుకి ఈ కథ బాగుంటుందనిపించి ఈ చిత్రం చేస్తున్నాం’’ అని దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు చెప్పారు. తారక ప్రభు ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో దాసరి రూపొందిస్తున్న చిత్రం ‘ఎర్రబస్సు’. తమిళ చిత్రం ‘మంజ ప్పై’కి ఇది రీమేక్. బుధవారం హైదరాబాద్‌లో దాసరి పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘ఈ సంస్థలో ఇది 33వ సినిమా. ఈ నెల 31న పాటలను, వచ్చే నెల 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఇది గొప్ప సినిమా అని విష్ణు అన్నారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు చక్రి, రేలంగి నరసింహారావు, రచయిత రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.వ్యక్తిగతంగా ఎవర్నీ అనలేదు: ఈ మధ్య ఓ సమావేశంలో తాను మాట్లాడిన మాటలను ఎలక్ట్రానిక్ మీడియాలో కొందరు వక్రీకరించారని దాసరి చెబుతూ ‘‘పరిశ్రమ మేలుకోరే వ్యక్తిగా పరిశ్రమ గురించి మాట్లాడతాను తప్ప, ఎవర్నీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయను. సునీల్‌ని ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేశానని చెప్పుకుంటున్నారు. నా మాటల్లోని మంచిని తీసుకోవాలని, వక్రీకరించవద్దని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
పిల్లల్లో పిల్లాడు పెద్దల్లో పెద్దాడు
వృద్ధాప్యం ఓ విధంగా బాల్యం లాంటిదే. అలకలు, అల్లర్లు, మూతి ముడుపులు వృద్ధాప్యంలో కూడా ఉంటాయి. పిల్లలు అమ్మానాన్నల కంటే త్వరగా తాతలకు చేరువయ్యేది అందుకే. తాతయ్య అంటే పిల్లల్లో పిల్లాడు, పెద్దల్లో పెద్దాడు. దానికి నిదర్శనమే ఇక్కడున్న దాసరి నారాయణరావు స్టిల్. ఏడు పదుల వయసులో పిల్లల సైకిల్ని తొక్కడానికి ప్రయత్నిస్తున్నారాయన. పైగా షార్టూ, కలర్‌ఫుల్ టీ షర్టూ, తలపై హ్యాట్టూ, రన్నింగ్ షూ... ఓ రేంజ్లో ఉంది ఆయన గెటప్. ఇంతకీ దాసరి ఇలా పిల్లాడిగా ఎందుకు మారిపోయారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ‘ఎర్రబస్సు’ వచ్చేదాకా ఆగాల్సిందే. ఎందుకంటే... ఆ సినిమా కోసమే దాసరి ఇలా పిల్లాడిగా మారారు. ఆయన 151వ సినిమాగా ‘ఎర్రబస్సు’ రూపొందుతోంది. తమిళ చిత్రం ‘మంజప్పై’ ఈ సినిమాకు మాతృక. ఎంతగానో ఆకట్టుకుంటే తప్ప దాసరి రీమేక్‌లు చేయరు. తూర్పుపడమర, అద్దాలమేడ, టూటౌన్రౌడీ... ఇలా చాలా తక్కువ సినిమాలకు రీమేక్‌లు చేశారాయన. సుదీర్ఘ విరామం తర్వాత దాసరి చేస్తున్న రీమేక్ ఇదే కావడం విశేషం. తాతామనవళ్ల కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తాతగా దాసరి, మనవడుగా మంచు విష్ణు నటిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకూ హైదరాబాద్‌లో విష్ణు, కేథరిన్‌లపై చిత్రీకరించనున్న పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. దాసరి మాట్లాడుతూ- ‘‘అసలు కంటే కొసరే ముద్దు. అలాగే... తండ్రికి కొడుకు కంటే... కొడుకు బిడ్డంటేనే ముద్దు. తరాలు మారుతున్నా... తాతామనవళ్ల అనుబంధంలో మాత్రం అప్పటికీ, ఇప్పటికీ మార్పు రాలేదు. రాదు కూడా. అలాంటి ఓ తాతా మనవడు కథే మా ‘ఎర్రబస్సు’. సాంకేతికంగా సమర్థవంతంగా ఉంటుందీ సినిమా. విష్ణు నా మనవడి పాత్రను చక్కగా పోషించాడు. నటునిగా తనను మరోమెట్టు పైన కూర్చోబెట్టే సినిమా ఇది. అలాగే కేథరిన్ కూడా మంచి పెర్ఫార్మర్. ఈ నెల చివరి వారంలో పాటలను, నవంబర్ 14న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నాజర్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అంజి, సంగీతం: చక్రి. -
నాన్‌స్టాప్‌గా ఎర్రబస్సు!
కల్లాకపటం లేకుండా, అమాయకంగా మాట్లాడే పల్లెటూరి వ్యక్తిని చూస్తే ‘వీడెవడ్రా.. ఇప్పుడే ఎర్రబస్సు దిగినట్టున్నాడు?’ అనే కామెంట్లు వినిపిస్తాయి. ‘ఏరా ఎర్రబస్సు’.. అని నిక్‌నేమ్ పెట్టేసి మరీ పిలుస్తుంటారు. అలా పల్లె నుంచి నగరానికొచ్చిన ఓ అమాయకపు పెద్దాయనగా దాసరి నారాయణరావు కనిపించనున్నారు. సినిమా పేరు ‘ఎర్రబస్సు’... కథకు తగ్గట్టుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేశారు దాసరి. తమిళ చిత్రం ‘మంజా పై’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తారకప్రభు ఫిలింస్ పతాకంపై దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ తాత, మనవళ్ల కథలో.. తాతగా దాసరి, మనవడిగా మంచు విష్ణు నటిస్తుండటం విశేషం. దర్శకునిగా దాసరికి ఇది 151వ చిత్రం. నేడు ఈ చిత్రం ప్రారంభమైంది. విష్ణు, కేథరిన్ పాల్గొనగా లహరి గార్డెన్స్‌లో పాట చిత్రీకరిస్తున్నారు. అనంతరం జంట నగరాల్లోని పలు లొకేషన్స్‌లో షెడ్యూల్స్‌ని ప్లాన్ చేశారు. చిత్రవిశేషాలను దాసరి తెలియజేస్తే-‘‘అరవై రోజులు ఏకధాటిగా జరిపే షూటింగ్‌తో ఈ చిత్రం పూర్తవుతుంది. అన్ని భాషలవారికీ, అన్ని వయసుల వారికీ నచ్చే కథ ఇది. భావోద్వేగాలకు ఈ కథలో పెద్దపీట వేయడం జరిగింది. వాస్తవానికి అద్దం పట్టేలా పాత్రలుంటాయి’’ అని చెప్పారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కృష్ణుడు, రఘుబాబు, కాశీవిశ్వనాథ్, బేబీ నిరాజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: అంజి.