ఇప్పుడు చాలామంది కథల కోసం ఆకాశానికి, సముద్ర లోతులకు వెళ్తున్నారు! | Manchu Vishnu is a prankster: Dasari | Sakshi
Sakshi News home page

ఇప్పుడు చాలామంది కథల కోసం ఆకాశానికి, సముద్ర లోతులకు వెళ్తున్నారు!

Published Thu, Nov 13 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ఇప్పుడు చాలామంది కథల కోసం ఆకాశానికి, సముద్ర లోతులకు వెళ్తున్నారు!

ఇప్పుడు చాలామంది కథల కోసం ఆకాశానికి, సముద్ర లోతులకు వెళ్తున్నారు!

ఎర్రబస్సు నుంచి ఎయిర్ బస్సు వరకూ... గల్లీ నుంచి ఢిల్లీ వరకూ... నథింగ్ నుంచి ఎవ్రీథింగ్‌గా... ఎదిగిన ప్రస్థానం దాసరిది. ఆయన ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రే ఉండదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 151వ సినిమా ‘ఎర్రబస్సు’. దాసరి, మంచు విష్ణు తాతా, మనవళ్లుగా నటించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దాసరితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ.
 
మొదటిసారి ఎర్రబస్సు ఎప్పుడెక్కారో ఓసారి గుర్తు చేసుకుంటారా?
ఏలూరులోని ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ ఆఫీసులో నా పేరు నమోదు చేయించుకోవడానికి పాలకొల్లులో మొదటిసారి ఎర్ర బస్సెక్కాను. ఆ తర్వాత ఉద్యోగాన్వేషణలో భాగంగా ఎర్రబస్సెక్కి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు భాగ్యనగరంలో నా ప్రయాణాలు సాగింది ఎర్రబస్సులోనే.
 
సో.. ఎర్రబస్ అని కొంతమంది తేలికగా తీసిపారేస్తారు కానీ, ఆ బస్సెక్కినవాళ్లూ పైకొస్తారనడానికి మీరో ఉదాహరణ అన్నమాట?
ఎర్ర బస్సుని తేలికగా తీసిపారేయకూడదు. ఎంతోమంది మహామహులు ఎక్కిన బస్ అది. అందుకే, ఈ సినిమాలో ‘ఎర్రబస్సని అంత తేలికగా మాట్లాడకండి.. ఎర్రబస్సు ఎక్కొచ్చినోళ్లు ఢిల్లీలోని ఎర్రకోట మీద జెండా ఎగరేశారు’ అని డైలాగ్ కూడా పెట్టాను.
 
అప్పట్లో ఎర్ర బస్సులో మొదలైన మీ ప్రయాణం ఎయిర్ బస్ వరకూ వస్తుందని ఊహించారా?

అస్సలు లేదు. ఈ జీవితం ఆ దేవుడిచ్చిన వరం. చదువుకోవడానికి చాలా అవస్థలు పడినవాణ్ణి. పాలకొల్లు రోడ్ల మీద భుజం మీద అరటిపళ్ల కావిడేసుకుని, ‘అరటి పళ్లోయ్.. అరటి పళ్లోయ్..’ అని అమ్ముకున్న రోజులు నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడున్న జీవితాన్ని నేనేప్పుడూ ఊహించలేదు. కేవలం నాటకాలు వేయడం, రాయడం అనే నా వ్యాపకం నన్నింతటివాణ్ణి చేసింది. టైప్ రైటింగ్ హయ్యర్‌లో నేను గోల్డ్ మెడలిస్ట్‌ని. షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. అది కానీ, నేను పుచ్చుకున్న డిగ్రీ పట్టా కానీ.. నన్నీ స్థాయికి తీసుకురాలేదు. నాటకాల మీద ఉన్న ఆసక్తే నా ప్రయాణాన్ని ఇంతవరకూ తీసుకొచ్చింది.
 
150 సినిమాలకు దర్శకత్వం వహించడమంటే మాటలు కాదు.. ఇప్పుడు కథలు దొరక్క, సినిమాలు తీయడంలేదని చాలామంది అంటున్నారు. అసలు మీకు 150 కథలు ఎలా పుట్టాయి?
మంచి ప్రశ్న. కథల కోసం ఇప్పుడు చాలామంది ఆకాశానికి, సముద్ర లోతులకు వెళుతున్నారు. కానీ, కథలు అక్కడ పుట్టవు. మన విలేజ్‌లో, టౌన్‌లో, వీధిలో, ఎదురింట్లో, పక్కింట్లో ఎన్నో పాత్రలుంటాయి. అన్ని పాత్రలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తే, అందులోంచి కథ పుడుతుంది. నా సినిమా కథలన్నీ జీవితంలోంచి పుట్టుకొచ్చినవే. అందుకే, ఎక్కువ శాతం విజయాలున్నాయి. నా సినిమాల్లోని ఆచారి, పోలీస్ వెంకటేశం, సూరిగాడు, మావగారు.. ఈ పాత్రలు జీవితంలో ఎక్కడోచోట తారసపడతాయి. అందుకే, ఆ పాత్రలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి.
 
ప్రస్తుతం ‘హీరో వర్షిప్’ ట్రెండ్ నడుస్తోంది కదా.. ‘ఎర్రబస్సు’ చిత్రం అందుకు భిన్నంగా ఉంటుందేమో?
మళ్లీ మనకిలాంటి సినిమాలు రావాలి అని ‘ఎర్రబస్సు’ చూసినవాళ్లు అంటారు. హీరోల మీద కథలు రావడం తప్పు కాదు. కానీ, హీరోల కుటుంబాల గురించి, వంశాల గురించి మాట్లాడటం ఎక్కువైంది. దానివల్ల సినిమా అనే ఫీల్ పోయింది. తాతా, మనవళ్ల కథలెప్పుడూ బాగుంటాయి. తల్లీతండ్రి మందలిస్తే పిల్లలొచ్చి చెప్పుకునేది తాత దగ్గరే. తమకేదైనా కావాలంటే... తాతతో రికమండ్ చేయించుకుంటారు. ఇవన్నీ ఎంత బాగుంటాయో చెప్పక్కర్లేదు. ఇది యువతరానికి కనెక్ట్ అయ్యే సినిమా. మానవీయ విలువలున్న చిత్రం.
 
నీరాజిత బాగా యాక్ట్ చేసింది
నీరాజిత అల్లరి పిల్ల. వాళ్ల అమ్మ హోమ్‌వర్క్ చేయమంటే సెలైంట్‌గా నా దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. నా దగ్గర ఉన్నప్పుడు పిలవరు కదా. అది తన ఐడియా. కానీ, ఆ తర్వాత ఎప్పటికో నాకు తెలుస్తుంది తను హోమ్‌వర్క్ రాయలేదని. అమ్మా, నాన్న తిడితే.. వచ్చేది నా ఒళ్లోకే. చాక్లెట్ తినొద్దని వాళ్ల అమ్మ అంటే.. ఆ చాక్లెట్ కోసం నా దగ్గరకు వస్తుంది. నీరాజిత నాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మర్చిపోలేని అనుభూతి. బాగా యాక్ట్ చేసింది.
 
మీ ఆన్‌స్క్రీన్ మనవడు విష్ణు గురించి?
తమిళ చిత్రం ‘మంజ పై’ చూడగానే మా ఇద్దరికీ నప్పే కథ ఇదనిపించింది. మన తెలుగు నవలల్లో.. ఉదాహరణకు యద్దనపూడి సులోచనారాణి నవలల్లో హీరో ఉంటాడే.. విష్ణు అచ్చంగా అలాంటి హీరోనే. అమెరికాలో స్థిరపడాలనుకునే కుర్రాడి కథ ఇది. అందుకు మూడు నెలల సమయం ఉండటంతో తాతను నగరానికి పిలిపించి, ఆ మూడు నెలలు ఆనందంగా ఉంచాలనుకుంటాడు. తాత కావాలి.. ప్రేయసి కావాలి. తాత కోసం ఇక్కడ ఉండాలా? ప్రేయసి కోసం అమెరికా వెళ్లాలా? అని మదనపడే కుర్రాడిగా బాగా నటించాడు.
 
ఇది మీకు 151వ సినిమా. విదేశాల్లో విడుదలవుతున్న మీ తొలి సినిమా ఇదే.. ఎలా అనిపిస్తోంది?
151 చిత్రాలు తీసినా.. నా ప్రతి సినిమా నాకు తొలి సినిమానే. అప్పట్లో తెలుగు సినిమాలు విదేశాల్లో విడుదలయ్యేవి కావు. ఆ ట్రెండ్ మొదలైన తర్వాత యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా అక్కడ విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో నా సినిమా విదేశాలకు వెళ్లలేదు. ఇప్పుడు వెళుతున్నందుకు ఉద్వేగంగా ఉంది. అమెరికాలో ఈ సినిమాకి ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే, అక్కడుంటున్న మనవాళ్లు మన సంస్కృతీ, సంప్రదాయాలను, పల్లెటూళ్లను మర్చిపోలేదు. అందుకని అక్కడి వాళ్లకి కూడా బాగా నచ్చుతుంది.
 
మీరు ‘తాత-మనవడు’ తీసినప్పుడు తాత కాలేదు.. కానీ, ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్లతో సంపూర్ణ జీవితం అనుభవిస్తున్నారు.. అది వెండితెరపై ప్రతిబింబిస్తుందనుకోవచ్చా?
కచ్చితంగా. తాతను అయ్యాను కాబట్టే, ‘ఎర్రబస్సు’ని బాగా తీయగలిగాను. నిజజీవితంలో నా మనవళ్లు, మనవరాళ్లు ఏదైనాసరే నా దగ్గర చెప్పుకుంటారు. వాళ్లు పుట్టకముందు ఈ సినిమా తీసి ఉంటే.. కొంచెం అవాస్తవంగా తీసి ఉండేవాణ్ణేమో. కానీ, ఇప్పుడు చాలా సహజంగా తీశాను. మనవడో, మనవరాలో ఏడుస్తుంటే ఓ తాత మనసు ఎలా కదులుతుందో నాకు తెలుసు. అందుకని, నిజంగానే తాతలానే ఫీలై, చేశాను.
 
♦  ‘తాత-మనవడు’ తీసినప్పుడు మీకు తాత అనుభవం లేదు కదా.. మరి అదెలా తీశారు?

పరిశీలనా దృష్టి వల్లే తీయగలిగాను. అప్పటికి మా తాతలను, ఇంటి పక్క తాతలను చూసి ఉన్నాను కాబట్టి, ఆ అనుభవంతో తెరకెక్కించాను. కానీ, ‘ఎర్రబస్సు’లో తాతగా ఒదిగిపోవాలి కాబట్టి, స్వీయానుభవం అవసరం.
 
ప్రస్తుత సినిమాల్లో పంచ్ డైలాగులు, ప్రాసలు ఎక్కువగా ఉంటున్నాయి.. మరి.. ఈ సినిమాలో?
ఇప్పుడు పంచ్ డైలాగ్స్, ప్రాసల ట్రెండ్ నడుస్తోందన్నది చాలా మంది ఊహ. ఇది ఉంటేనే సినిమా ఆడుతుందని చెప్పడానికి ప్రత్యేకంగా పెద్ద బాలశిక్ష లేదు. కామెడీ సినిమా ఆడితే.. ఆ తరహా, యాక్షన్ అంటే.. ఆ రూట్‌లో వెళ్లిపోతున్నారు. మూడు రోజుల్లో వసూళ్లు రాబట్టాలంటే.. మన సినిమాలో ఏయే అంశాలుండాలని ఆలోచిస్తున్నారు తప్ప లాంగ్ స్టాండింగ్ కోసం చూడటంలేదు. ‘ఎర్ర బస్సు’లో ఏది ఉన్నా కథానుసారంగానే ఉంటుంది తప్ప, ట్రెండ్ అంటూ నేల విడిచి సాము చేయలేదు.
 - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement