విష్ణులో నాకు శోభన్‌బాబు కనిపిస్తాడు : దాసరి
‘‘విష్ణులో అందరికీ యాక్షన్ హీరో కనిపిస్తే, నాకు మాత్రం శోభన్‌బాబు కనిపిస్తాడు. అతను ఎంత మంచి నటుడో ఈ చిత్రం నిరూపిస్తుంది. నాతో పోటీ పడి మరీ విష్ణు నటించాడు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘ఎర్రబస్సు’. మంచు విష్ణు కథానాయకుడు. కేథరిన్ కథానాయిక. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మోహన్‌బాబు పాటల సీడీని ఆవిష్కరించి, సీనియర్ నిర్మాత కె.రాఘవకు అందించారు. ఇ.వి.వి.కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి పదివేల నూట పదహారు రూపాయలకు ఆడియో సీడీని కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ -‘‘తమిళ చిత్రం ‘మంజప్పై’కి ఇది రీమేక్. తాతా మనవళ్లుగా ఇందులో నేనూ, విష్ణు నటించాం. పతాక సన్నివేశాల్లో విష్ణు నటన కంటనీరు తెప్పిస్తుంది. చక్రి వినసొంపైన గీతాలు అందించాడు. ‘ఐస్‌క్రీమ్’ ఫేమ్ అంజి కెమెరా పనితనం అద్భుతం. ఇక బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రానికి హైలైట్. తప్పకుండా నా బ్లాక్‌బస్టర్స్‌లో ‘ఎర్రబస్సు’ కూడా ఒకటవుతుంది’’ అని చెప్పారు. కుమారుడు అరుణ్‌కుమార్ రూపంలో ఇంట్లోనే ఓ హీరో ఉండగా, విష్ణుకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన నా గురువు, దైవం దాసరిగారికి కృతజ్ఞతలని మోహన్‌బాబు పేర్కొన్నారు.
దాసరి విజయవంతమైన చిత్రాల్లో ‘ఎర్రబస్సు’ కూడా ఒకటిగా నిలవాలని కృష్ణ, విజయనిర్మల ఆకాంక్షించారు. ‘ఎర్రబస్సు’తో 151వ చిత్రం చేస్తున్న దాసరి, త్వరలోనే దర్శకునిగా 200 చిత్రాలు పూర్తి చేయాలని కృష్ణంరాజు అభిలషించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు సినీరంగంలో స్టార్‌డమ్ అనేదాన్ని క్రియేట్ చేస్తే, దర్శకులకు స్టార్‌డమ్ తెచ్చిన ఘనత దాసరిదేనని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కొనియాడారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు కె.రాఘవేంద్రరావు, జమున, జయసుధ, గీతాంజలి, గిరిబాబు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.