పిల్లల్లో పిల్లాడు పెద్దల్లో పెద్దాడు
వృద్ధాప్యం ఓ విధంగా బాల్యం లాంటిదే. అలకలు, అల్లర్లు, మూతి ముడుపులు వృద్ధాప్యంలో కూడా ఉంటాయి. పిల్లలు అమ్మానాన్నల కంటే త్వరగా తాతలకు చేరువయ్యేది అందుకే. తాతయ్య అంటే పిల్లల్లో పిల్లాడు, పెద్దల్లో పెద్దాడు. దానికి నిదర్శనమే ఇక్కడున్న దాసరి నారాయణరావు స్టిల్. ఏడు పదుల వయసులో పిల్లల సైకిల్‌ని తొక్కడానికి ప్రయత్నిస్తున్నారాయన. పైగా షార్టూ, కలర్‌ఫుల్ టీ షర్టూ, తలపై హ్యాట్టూ, రన్నింగ్ షూ... ఓ రేంజ్‌లో ఉంది ఆయన గెటప్. ఇంతకీ దాసరి ఇలా పిల్లాడిగా ఎందుకు మారిపోయారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ‘ఎర్రబస్సు’ వచ్చేదాకా ఆగాల్సిందే. ఎందుకంటే... ఆ సినిమా కోసమే దాసరి ఇలా పిల్లాడిగా మారారు.
ఆయన 151వ సినిమాగా ‘ఎర్రబస్సు’ రూపొందుతోంది. తమిళ చిత్రం ‘మంజప్పై’ ఈ సినిమాకు మాతృక. ఎంతగానో ఆకట్టుకుంటే తప్ప దాసరి రీమేక్‌లు చేయరు. తూర్పుపడమర, అద్దాలమేడ, టూటౌన్‌రౌడీ... ఇలా చాలా తక్కువ సినిమాలకు రీమేక్‌లు చేశారాయన. సుదీర్ఘ విరామం తర్వాత దాసరి చేస్తున్న రీమేక్ ఇదే కావడం విశేషం. తాతామనవళ్ల కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తాతగా దాసరి, మనవడుగా మంచు విష్ణు నటిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకూ హైదరాబాద్‌లో విష్ణు, కేథరిన్‌లపై చిత్రీకరించనున్న పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. దాసరి మాట్లాడుతూ- ‘‘అసలు కంటే కొసరే ముద్దు. అలాగే... తండ్రికి కొడుకు కంటే... కొడుకు బిడ్డంటేనే ముద్దు.
తరాలు మారుతున్నా... తాతామనవళ్ల అనుబంధంలో మాత్రం అప్పటికీ, ఇప్పటికీ మార్పు రాలేదు. రాదు కూడా. అలాంటి ఓ తాతా మనవడు కథే మా ‘ఎర్రబస్సు’. సాంకేతికంగా సమర్థవంతంగా ఉంటుందీ సినిమా. విష్ణు నా మనవడి పాత్రను చక్కగా పోషించాడు. నటునిగా తనను మరోమెట్టు పైన కూర్చోబెట్టే సినిమా ఇది. అలాగే కేథరిన్ కూడా మంచి పెర్‌ఫార్మర్. ఈ నెల చివరి వారంలో పాటలను, నవంబర్ 14న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నాజర్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అంజి, సంగీతం: చక్రి.