తాగేసి కండోమ్ మర్చిపోయా
లాస్ ఏంజెలిస్: తనకు హెచ్‌ఐవీ వ్యాధి ఉందని హాలీవుడ్ ప్రముఖ నటుడు చార్లీ షీన్ గతేడాది డిసెంబర్ లో అంగీకరించాడు. ఓ ప్రైవేట్ చానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఆయన ఈ నిజాన్ని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. నిజానికి తాను కేవలం రెండుసార్లు మాత్రమే రక్షణ(కండోమ్) లేకుండా శృంగారంలో పాల్గొన్నట్లు తాజాగా తెలిపాడు. తరచుగా కండోమ్స్ యాడ్స్, వాటిపై ప్రచారం చేయడంతో కనిపించే చార్లీ.. తాను దురదృష్టవంతుడినని ఆవేదన వ్యక్తం చేశాడు.
దాదాపు నాలుగున్నర ఏళ్ల కిందట తనకు హెచ్‌ఐవీ సోకిందని తెలిసిందని, అప్పటినుంచి చికిత్స పొందుతున్నానని ఆయన వివరించారు. కేవలం రెండుసార్లు మాత్రమే అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్నాను, అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పాడు. ఫుల్లుగా తాగి కండోమ్ వాడటం మరిచిపోయానని దీంతో వైరస్ సంక్రమించి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. హెచ్ఐవీ సోకిన విషయం తెలిసిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు శృంగారంలో పాల్గొనడం మానలేదని చార్లీ వెల్లడించాడు.
తనకు సోకిన వ్యాధిని ఇతరులకు అంటించలేదని వ్యాఖ్యానించాడు. తనకు హెచ్‌ఐవీ ఉందన్న విషయం ఏడాది కిందటే తెలిసినా.. ఆ విషయాన్ని చార్లీ షీన్ దాచిపెట్టారని, ఆయనతో లైంగిక సంబంధం ఉన్న ఓ పోర్న్ స్టార్ కూడా వెల్లడించడంతో ఈ వార్త అప్పట్లో సంచలనం అయింది.