'త్వరలో షారుక్ ను మట్టి కరిపిస్తా'
ఇటీవల ఇఫ్తార్ విందులో కౌగిలింతలతో వ్యక్తిగత వివాదాలకు స్వస్తి చెప్పినా.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ ఫైట్ కు రాజీలేదని కింగ్ ఖాన్ షారుఖ్ కు కండలవీరుడు సల్మాన్ ఖాన్ హెచ్చరికల్ని పంపాడు. తన తదుపరి చిత్రంతో షారుఖ్ రికార్డులను మట్టి కరిపిస్తానని సల్మాన్ ఖాన్ సవాల్ విసిరాడు. బాక్సాఫీస్ వద్ద 'చెన్నై ఎక్స్ ప్రెస్' సృష్టిస్తున్న రికార్డుల గురించి తనకు చింత లేదని సల్మాన్ ధీమా వ్యక్తం చేశాడు. 'రంజాన్ వేడుకల సందర్భంగా తాను షారుఖ్ ను కౌగిలించుకున్నా. అదొక పవిత్ర మాసం. ఎదుటి వ్యక్తిపై మరో వ్యక్తి చూపించాల్సిన భావనను నేను చూపించాను. అది మానవీయ కోణంలో చూపించిన ఓ ఫీలింగ్ మాత్రమే' అని సల్మాన్ అన్నాడు.
షారుఖ్ తో శతృత్వం ఏమి లేదని.. గతంలో నా పేరిట ఉన్న రికార్డులను ఆయన అధిగమించాడు. నాకేమైనా ఇబ్బంది ఉంటే తాను తన సామర్ధ్యంతో అధిగమిస్తాను అని సల్మాన్ తెలిపాడు. అమీర్ ఖాన్ ధూమ్-3 చిత్రం కాని..రణబీర్ మరో చిత్రం కాని.. మరేవ్వరి చిత్రమైనా కాని.. బాక్సాఫీస్ వద్ద తన తదుపరి చిత్రంతోనే సమాధానమిస్తానని అన్నాడు. రంజాన్ రోజున విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం 225.7 కోట్ల వసూళ్లతో గతంలో సల్మాన్ పేరున ఉన్న రికార్డులను తుడిచిపెట్టిన సంగతి తెలిసిందే.