
కెమెరా.. యాక్షన్.. రోలింగ్... ఈ పదాలను పదే పదే చెప్తున్నారు కానీ ప్యాకప్ అనే మాట మాత్రం అంత ఈజీగా చెప్పడం లేదట బాలీవుడ్ దర్శకుడు దిబాకర్ బెనర్జీ. రోజుకి ఆల్మోస్ట్ 16 గంటలకు పైగా షూటింగ్ జరుపుతున్నారట. ఇలా ఏదో ఒక రోజు అయితే పర్వాలేదు కానీ కంటిన్యూస్‌గా నాలుగు రోజులుగా లొకేషన్లో ఇదే జరగడంతో డీలా పడిపోయారట హీరోయిన్ పరిణీతి చోప్రా.
‘షాంఘై, బాంబే టాకీస్’ వంటి హిందీ చిత్రాలను రూపొందించిన దిబాకర్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’. అర్జున్ పోలీస్ పాత్రలో నటిస్తుండగా, పరిణీతి కార్పొరేట్ అమ్మాయి రోల్ చేస్తున్నారు. ‘‘షూటింగ్ లొకేషన్‌లో ఆల్రెడీ 16 గంటలు గడిచిపోయాయి. ఇంకా ప్యాకప్ చెప్పలేదు. నాలుగు రోజుల నుంచి సరిగా నిద్రపోలేదు. నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసుగా... గ్లామర్ తగ్గిపోతుంది’’ అని పేర్కొన్నారు పరిణీతి. అదండీ సంగతి. అందమైన అమ్మాయికి ఆ మాత్రం బెంగ ఉండదంటారా.