హీరోలతో అలా నటించను
హీరోలతో అలా నటించను
Published Thu, Nov 21 2013 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
సినిమాలో మార్కెట్ కోసం గ్లామరస్‌గా నటించనని ఖరాఖండిగా చెబుతోంది నటి శరణ్యా మోహన్. కుటుంబ కథా చిత్రాల్లోనే నటిస్తానని మొదట్లో స్టేట్‌మెంట్స్ ఇచ్చిన చాలా మంది హీరోయిన్లు ఒకటి రెండు చిత్రాల తర్వాత పూర్తిగా గ్లామర్‌కు మారిపోతున్నారు. పూ చిత్రం ఫేమ్ పార్వతి, అనన్య, నజ్రినా నజిమ్ వంటి హీరోయిన్లు మాత్రం గ్లామర్ పాత్రలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ఈ కోవకు చెందిన నటి శరణ్యా మోహన్. తమిళంలో వెన్నిలా కబడి కుళు చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరపైకి వచ్చిన ఈ మలయాళీ భామ బాలనటిగానే చిత్ర రంగ ప్రవేశం చేసింది.
పలు చిత్రాల్లో హీరోలకు ముద్దుల చెల్లెలిగా నటించింది. టాలీవుడ్‌లోను హీరోయిన్‌గా అడపాదడపా నటిస్తున్న ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలకు మాత్రం ససేమిరా అంటోంది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ గ్లామర్‌గా నటిస్తేనే సినిమాలో కొనసాగగలమన్న విషయాన్ని నేను అంగీకరిస్తానని తెలిపారు. అందుకు గ్లామరస్ దుస్తులు అవసరమేనన్నారు. అలా నటించడానికి తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. చిత్రంలో వ్యాపార దృక్పథం కోసం హీరోలతో అత్యంత సన్నిహితంగా నటించడం తనవల్లకాదన్నారు. అదే విధంగా అరకొర దుస్తులు ధరించి నటించనని వెల్లడించారు. పక్కింటి అమ్మాయిని చూడగానే ఎంత చక్కగా ఉందనిపిస్తుందో అలాంటి మంచి కథా పాత్రల్లోనే నటిస్తానని శరణ్యా మోహన్ పేర్కొన్నారు.
Advertisement