'నేనే దేవుడ్ని...నేను దేవుడ్ని నమ్మను'
గుంటూరు : మహాభారతంలో హింస కన్నా బెజవాడలోనే ఎక్కువగా హింస జరిగిందని ప్రముఖ దర్శక,నిర్మాత రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. శనివారం కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులతో...వర్మ చర్చావేదిక జరిగింది. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ...'నేనే దేవుడ్ని...నేను దేవుడ్ని నమ్మను. యముడు వచ్చి గొంతుమీద కత్తి పెట్టినా భక్తి సినిమా తీయను' అని వ్యాఖ్యానించారు. మరోవైపు వంగవీటి సినిమా తీయడానికి ఆ కథకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వర్మ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)తో ఆయన ఈరోజు ఉదయం సమావేశమయ్యారు. అలాగే నగరంలోని పలువురి ప్రముఖుల నుంచి వివరాలను ఆయన సేకరిస్తున్నారు. గతరాత్రి వంగవీటి రంగా అనుచరులు, సన్నిహితులతో వర్మ భేటీ అయ్యారు. కాగా వంగవీటి రంగా సతీమణి రత్నకుమారి...వర్మన కలిసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇక తన స్నేహితుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ను ఇవాళ ఆయన కలవనున్నారు.