మహేశ్ అందంగా ఉంటే మంచిదే కదా! | If Mahesh pretty good for you! | Sakshi
Sakshi News home page

మహేశ్ అందంగా ఉంటే మంచిదే కదా!

Published Sat, Aug 1 2015 12:11 AM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

If Mahesh pretty good for you!

శ్రుతీహాసన్ చాలా స్ట్రాంగ్! ఇండిపెండెంట్.. ఇంటెలిజెంట్! ఆమె దృష్టిలో గ్లామర్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్! ఎక్కడ ఎటాచ్ కావాలో... ఎప్పుడు డిటాచ్ కావాలో...ఆమెకు బాగా తెలుసు గ్రేట్ యాక్టర్ కమల్‌హాసన్ కూతురిగా గోల్డెన్ స్పూన్‌తో పెరిగినా లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారామె.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శ్రుతి ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్. మహేశ్‌బాబుతో ‘శ్రీమంతుడు’లో చారుశీలగా క నబడిన శ్రుతి చెప్పిన ముచ్చట్లు...
 
 ***     సినిమా సినిమాకీ మీ అందం పెరుగుతోందనిపిస్తోంది... ఏంటా రహస్యం?
 థ్యాంక్స్ అండి. చెప్పాలంటే నేను ప్రత్యేకంగా ఏమీ చేయడంలేదు. వయసుతో పాటు మెచ్యూర్టీ వస్తుంది కదా.. అప్పుడు అందం కూడా పెరుగుతుంది.
 ***     అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందా?
 అలా ఏం లేదు. స్టయిల్‌గా కనిపించడం కోసం జుత్తుకు రంగేసుకోవడం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం పెదాలకు రంగు వేసుకోవడం ముఖ్యం కాదు. లోపల మనం స్ట్రాంగ్‌గా లేకపోతే పై పైన ఎన్ని మెరుగులు దిద్దుకున్నా పేలవంగా కనిపిస్తాం. మన మీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే అప్పుడు అందంగా లేకపోయినా అందంగానే కనిపిస్తాం. బాహ్య సౌందర్యం అనేది దేవుడి ఇచ్చేది. ఇన్నర్‌గా స్ట్రాంగ్‌గా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది. అందంగా లేకపోయినా ఫర్వాలేదు... ఆత్మవిశ్వాసం లేకపోతే ఏమీ చేయలేం.


 ***     మీ ప్రొఫెషన్ అందంతో ముడిపడింది కాబట్టి, చాలా కేర్ తీసుకోవాలిగా?
 అఫ్‌కోర్స్ అది నిజమే. మాది గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి, కేర్ తీసుకోవాలి. లేకపోతే ప్రేక్షకులు డిజప్పాయింట్ అవుతారు. అలాగని బ్యూటీ కేర్ కోసం నేను గంటలు గంటలు కేటాయించను. ఎంత తీసుకోవాలో అంతే.
 ***     స్ర్కీన్‌పై గ్లామరస్‌గా కనిపించే మీరు.. రియల్‌గా కూడా అలానే ఉండాలనుకుంటారా?
 నా పర్సనల్ లైఫ్‌లో నేను గ్లామరస్‌గా ఉండను. చాలా నిరాడంబరంగా ఉంటాను. వీలైనంతవరకూ మేకప్ జోలికి వెళ్లను. సింపుల్‌గా డ్రెస్ చేసుకుంటాను. హెయిర్ స్టయిల్ కూడా చాలా మామూలుగా ఉంటుంది. మొత్తం మీద చాలా కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటాను.


 ***     తెలుగులో మీ తొలి సినిమా ‘అనగనగా ఓ ధీరుడు’ టైమ్‌లో కంటే... ఇప్పుడు నూతన నాయికల తాకిడి ఎక్కువైంది... పోటీ బలంగానే ఉంది కదా?
 నేను పోటీనీ పట్టించుకోను. ఎవరి సినిమాలు వాళ్లకి ఉంటాయి. అయినా ఏడాదికి 20 సినిమాలు వస్తే... అన్నింటిలో నేనే నటించలేను కదా. ఎన్ని చేయగలనో అన్నే చేస్తున్నాను.
 ***     ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయడంవల్ల విశ్రాంతి తీసుకునే వీలు చిక్కడంలేదేమో?
 చేతి నిండా పని ఇస్తున్నందుకు థ్యాంక్స్ టు గాడ్. విశ్రాంతి లేకపోతేనేం ఆనందంగా ఉన్నాను.
 ***     మరి పెళ్లెప్పుడు చేసుకుంటారు?
 ఎప్పుడో ఒకసారి చేసుకోవాల్సిందే. ఎప్పుడని చెప్పలేను. ఎందుకంటే, దాని గురించి అస్సలు ఆలోచించడంలేదు.
 ***     ఓకే... త్వరలో విడుదల కానున్న మీ ‘శ్రీమంతుడు’ సినిమా విషయానికొద్దాం.. మహేశ్‌బాబుతో ‘ఆగడు’ కోసం ఐటమ్ సాంగ్ చేసినప్పుడు ఈ సినిమా సెట్ అయ్యిందా... అంతకుముందేనా?
 ‘శ్రీమంతుడు’ గురించి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే ‘ఆగడు’ ఐటమ్ సాంగ్ చేశాను. ఆ పాట బాగుంటుంది. డ్యాన్స్‌కి స్కోప్ ఉంది కాబట్టి చేశాను.


 ***     మహేశ్‌బాబు గురించి ఏం చెబుతారు?
 మంచి నటుడు. ఆయన ప్రవర్తన చాలా బాగుంటుంది. క్రమశిక్షణ గల వ్యక్తి. లొకేషన్లో తనతో పాటు పని చేసే వ్యక్తులు అసౌకర్యానికి గురయ్యేలా చేయరు.
 ***     మహేశ్ బాగా జోక్స్ వేస్తారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. మరి మీరేమంటారు?
 అవును. అది నిజమే. జోక్స్ వేస్తారు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ యూనిట్ మొత్తం చాలా సరదాగా ఉండేది. షూటింగ్ ఎలా పూర్తయ్యిందో తెలియనంత వేగంగా జరిగింది.
 ***     మామూలుగా మహేశ్‌బాబు మంచి అందగాడు కాబట్టి, ఆయన సరసన నటించే నాయికలు పెద్దగా ఎలివేట్ కారనే టాక్ ఉంది...
 ఏవండీ... ఇదేమైనా ‘మిస్ ఇండియా’ పోటీనా? మేమంతా కలిసి సినిమా చేస్తున్నాం. మహేశ్ అందంగా ఉంటే మంచిదే కదా. హీరో, హీరోయిన్‌లిద్దరూ చూడచక్కగా ఉంటే సినిమాకి ప్లస్ అవుతుంది.


 ***     ఈ చిత్రంలో మీరు చేసిన ‘చారుశీల’ పాత్ర గురించి?
 చారుశీల చాలా స్ట్రాంగ్... ఇండిపెండెంట్... ఇంటలిజెంట్. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది. మామూలుగా నేను ఏ కొత్త పాత్ర అంగీకరించినా నా గత పాత్రలకు భిన్నంగా ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే, చేసిన పాత్రనే చేస్తే నాకు బోర్ కొడుతుంది. ఒకే రకమైన పాత్రలో నన్ను చూసి ప్రేక్షకులకూ బోర్ కొట్టేస్తుంది.
 ***     కొరటాల శివ గురించి?
 సెన్సిబుల్ డెరైక్టర్. కామ్‌గా ఉండే స్వీటెస్ట్ టీచర్ అని చెప్పొచ్చు. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. వాళ్లకి ఎలా కావాలంటే అలా నటిస్తా.
 ***     తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా.. మరి మీ పాత్రకు మీరు డబ్బింగ్ చెప్పుకోవచ్చు కదా?
 చెప్పాలనే ఉందండి. ‘ఎందుకు శ్రుతీతో డబ్బింగ్ చప్పించడంలేదు’ అని మీరు దర్శకులను అడగండి. నాక్కూడా హ్యాపీగా ఉంటుంది.
 ***     మామూలుగా మీరు ఏ సినిమాలో నటించినా అందులో ఒక్క పాట అయినా పాడతారు కదా.. మరి ‘శ్రీమంతుడు’లో ఎందుకు పాడలేదు?
 ఈ ప్రశ్న కూడా మీరు కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌ని అడగాలి.  సినిమాలో పాడించలేదు కాబట్టే, ఆడియో ఫంక్షన్ రోజున స్టేజి మీద పాడించారేమో (నవ్వుతూ).


 ***     కమల్‌హాసన్ కూతురు కాబట్టి, సినిమా ఫీల్డ్‌లో మీ దారి రహదారి అనుకోవచ్చా?
 అలా ఏమీ లేదండి. బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి, డోర్ ఓపెన్‌గా ఉంటుంది. అవకాశం ఈజీగా వస్తుంది. ఒకవేళ నేను బాగా నటించలేదనుకోండి... కమల్‌హాసన్ కూతురే కదా అని రెండో అవకాశం ఇవ్వరు. నేను నటించాలి. కొత్తవాళ్లకి ఉండే ప్రెజర్స్ వాళ్లకుంటాయి. మాకుండేవి మాకుంటాయ్. రెండో సినిమాకే మా తల్లిదండ్రుల్లా గొప్ప నటన కనబర్చాలనుకుంటారు. అది ఎంత ఒత్తిడిగా ఉంటుందో మీరే ఊహించండి.
 ***     మీ చెల్లెలు అక్షరతో కలిసి సినిమా చేస్తారా?
 కథ కుదిరితే తప్పకుండా చేస్తా.
 ***     అక్షరకు ఎలాంటి సలహాలిస్తుంటారు?
 మా అమ్మా నాన్న నాకెలాంటి సలహాలివ్వలేదు. ‘నీ లైఫ్ నీ ఇష్టం. తెలివిగా నిర్ణయాలు తీసుకో’ అని చెప్పారు. ఎప్పుడైనా అవసరమైతే సలహాలిస్తారు. నేను కూడా నా చెల్లెలికి సలహాలివ్వను. అవసరమైనప్పుడు మాత్రం కచ్చితంగా ఇస్తా.
 ***     ఒక పాత్ర చేస్తున్నప్పుడు మీరు ఆ మూడ్‌లో ఎంతసేపు ఉంటారు?
 కెమెరా ముందు ఉన్నంతవరకే ఆ మూడ్‌లో ఉంటాను. ఆ తర్వాత కటాఫ్ చేసేస్తాను. ‘నేనివాళ సీరియస్ సీన్ చేస్తున్నాను కాబట్టి, నాతో ఎవరూ మాట్లాడొద్దు. నేను సీరియస్‌గా ఉండాలి’ అని ఎవరితోనూ అనను. హాయిగా నవ్వుతు ఉంటాను. కెమెరా ముందుకెళ్లాక సీరియస్ అయిపోతా. ఎటాచింగ్, డిటాచింగ్ రెండూ తెలియాలి. ఆ క్షణంలో నేనేం చేస్తున్నానో దానికి పూర్తిగా ఎటాచ్ అయిపోతా. ఆ పని పూర్తయ్యాక డిటాచ్ అయిపోతా.


 ***      ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మీరు మోస్ట్ వాంటెడ్... ఎలా అనిపిస్తోంది?
 అనందంగానే ఉందండి. అదే విధంగా ఇది నిరంతరం కాదని కూడా నాకు తెలుసు. నా చిన్నప్పుడు నాన్నగారి కెరీర్ గురించి నాకు చాలా విషయాలు తెలిసేవి. ఆయన మంచి మంచి సినిమాలు చేసినప్పుడు అభినందించేవారు. ఫ్లాప్ సినిమా చేసినప్పుడు పెదవి విరిచేసేవారు. అందుకే, సక్సెస్‌ని నెత్తికెక్కించుకోకుండా నా పని నేను సిన్సియర్‌గా చేసుకుంటూ వెళుతున్నాను.
 ***     మంచి మంచి సినిమాలు చేస్తున్నారు  కాబట్టి, ఇప్పుడు మీది గోల్డెన్ లెగ్ అనుకోవచ్చా?
 గోల్డెన్, సిల్వర్, ఐరన్ లెగ్ అనుకోవడానికి ఇదేమన్నా జ్యువెలరీ షాపా! అలా ఏమీ ఉండదండి. అయినా నా కాలు ఎప్పటిలానే ఉంది (నవ్వుతూ). కాకపోతే ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు ఏదేదో అంటారు. హిట్ వచ్చాక గోల్డెన్ లెగ్ అంటారు. వాటితో నాకు సంబంధం లేదు.
 ***     ఫైనల్లీ.. మీ కెరీర్‌ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది?
 నేనేదీ ప్లాన్ చేయలేదు. అంతా ఆ దేవుడే ప్లాన్ చేశాడు. ఆ ప్రకారం వెళ్లిపోతున్నాను. ఏది ఏమైనా మంచి పాత్రలు చేసే అవకాశం వస్తోంది. వాటికి న్యాయం చేయడానికి వంద శాతం కృషి చేస్తున్నా. ప్రస్తుతం నా కెరీర్ హ్యాపీగా ఉంది.
 - డి.జి.భవాని

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement