శ్రీమంతుడు దిల్లున్నోడు | prince mahesh babu srimanthudu movie special | Sakshi
Sakshi News home page

శ్రీమంతుడు దిల్లున్నోడు

Published Fri, Aug 7 2015 11:42 PM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

శ్రీమంతుడు దిల్లున్నోడు - Sakshi

శ్రీమంతుడు దిల్లున్నోడు

‘అంతా నేనే’ అనుకుంటే అధిపతి అవుతారేమో!
‘అంతా నాది’ అనుకుంటే ఆస్తిపరులు అవుతారేమో!
‘అంతా మనవాళ్లే’ అనుకుంటే శ్రీమంతులవుతారు.
ఆస్తి సున్నా అయినా ఫర్వాలేదని...
సంతకం పెట్టిన చెక్కుమీద ఎక్కువ సున్నాలుంటే...
ఓహ్... దిల్లున్న మహారాజులవుతారు.
మనిషి జీవితాన్ని ఎంతగా ప్రేమించాడన్నది విషయం కాదు...
మనిషి ఎంతమంది ప్రేమను సంపాదించాడన్నది పరమార్థం.
అదే ఈ శ్రీమంతుడి అసలైన బ్యాంక్ బ్యాలెన్స్.

 
 
తారాగణం: మహేశ్‌బాబు, శ్రుతీహాసన్, జగపతి బాబు, ముఖేశ్‌రుషి, రాజేంద్రప్రసాద్, సుకన్య, తులసి; కెమేరా: మది; సంగీతం: దేవిశ్రీప్రసాద్; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు; నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్; రచన - దర్శకత్వం: కొరటాల శివ; రిలీజ్ డేట్: ఆగస్టు 7; నిడివి: 163 నిమిషాలు.
 
 
 కొత్త సినిమా గురూ!

 
ఆగస్టు 9వ తేదీ. హీరో మహేశ్‌బాబు పుట్టినరోజు. ప్రతి ఏటా మహేశ్ ఫ్యాన్స్‌కూ, ఆయన తండ్రి హీరో కృష్ణ ఫ్యాన్స్‌కూ అది పండగరోజు. కానీ, ఈ సారి పండుగ రెండు రోజులు ముందే వచ్చింది. ఆగస్టు 7... శుక్రవారం... హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని పాపులర్ సినిమా థియేటర్ల దగ్గర కోలాహల వాతావరణమే అందుకు ఉదాహరణ. ఒక్క రాజధానిలోనే కాదు... రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్యపట్నాల్లో... దేశవిదేశాల్లో ఇంచుమించు ఇదే సీన్... రిపీట్. ‘శ్రీమంతుడు’ రిలీజ్.

వెనక్కి ఇచ్చేయాలనుకున్న ‘శ్రీమంతుడు’
 ఇంతకీ ‘శ్రీమంతుడు’లో ఏముంది? సినిమా కథేమిటి? రొటీన్‌గా వస్తున్న సినిమాలకు భిన్నమైన స్టోరీలైన్ ఇది. ఉద్యోగం, వ్యాపారం కోసం సొంత ఊరొదిలేసి వచ్చేస్తున్న మనం ఎంతో సంపాదించినా, ఆ ఊరికేం చేస్తున్నాం? ఏం చేయాలి? అన్నది బేసిక్ పాయింట్. మొత్తం రెండు గంటల 43 నిమిషాల నిడివి... యు/ఏ సర్టిఫికెట్.

రవికాంత్ (జగపతిబాబు) పాతికవేల కోట్ల వ్యాపారానికి అధిపతి. భార్య (సుకన్య), తమ్ముడు (సుబ్బరాజు), మేనల్లుడు కార్తీక్ (రాహుల్ రవీంద్ర) - ఇలా చాలా పెద్ద ఫ్యామిలీ. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఇంత కుటుంబానికీ, వ్యాపారానికీ ఒకే ఒక్క వారసుడు... హర్ష (మహేశ్‌బాబు). తండ్రికేమో కొడుకు తన లైన్‌లోకొచ్చేసి, వ్యాపారం చూసుకోవాలని! కానీ, కొడుకు ఆలోచన వేరు. ‘లెట్ మీ ఎర్న్ సమ్ రెస్పెక్ట్’ అంటాడు. డబ్బును పెంచుకొనే కన్నా ఇన్నేళ్ళుగా సంపాదించుకున్న అనుబంధాలనూ, ఆత్మీయతనూ పంచుకోవాలంటాడు. పెంచుకోవాలంటాడు! బెంజ్ కార్లున్నా స్టయిలిష్ సైకిల్ వాడే టైపు! ఆఫీస్ స్టాఫ్ చేసుకొనే శ్రీరామనవమి ఉత్సవానికి తండ్రి ఎగ్గొట్టినా, తాను వెళ్ళి ‘రామ రామ...’ అంటూ రామాయణ గీతం పాడి, ఆడి వచ్చే రకం. అందుకే, తండ్రికీ, కొడుకుకూ మధ్య ఒక చిన్న గ్యాప్.

ఇంతలో హీరోకు చారుశీల (శ్రుతీహాసన్) తారసపడుతుంది. ఎం.బి.ఏ. చదివి, రూరల్ డెవలప్‌మెంట్ కోర్స్ చేస్తుంటుంది. ‘చాలా ఇచ్చింది మా ఊరు.ఎంతో కొంత తిరిగిచ్చేయాలి’ అంటూ ఉంటుంది. ఆమె ప్రభావంతో హీరో కూడా రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులో చేరతాడు. ‘జత కలిసే జత కలిసే...’, ‘చారుశీలా స్వప్నబాలా...’ అని పాడుకుంటూ, ప్రేమలో పడతాడు. అతను ఫలానా డబ్బున్నవాళ్ళ కుర్రాడని తెలియక, ఆమే ప్రేమించేస్తుంది.

 మరోపక్క  కేంద్ర మంత్రి వెంకట రత్నం (ముఖేశ్ ఋషి) కథ. హైవేల విస్తరణ కాంట్రాక్ట్ కోసం అతని కొడుకు (హరీష్ ఉత్తమన్) వచ్చి, హీరో తండ్రిని బెదిరిస్తాడు. విషయం తెలిసి, హీరో రంగంలోకి దిగుతాడు. విలన్ల బెండు తీస్తాడు. ఉత్తరాంధ్రలోని దేవరకోట గ్రామం ఆ కేంద్రమంత్రిది. అతని తమ్ముడు శశి (‘మిర్చి’ ఫేమ్ సంపత్‌రాజ్) ఆ ప్రాంతాన్నీ, ప్రజల్నీ పట్టి పీడిస్తుంటాడు.

ఆ ఊరికి సరైన రోడ్డు లేదు. బడి లేదు. వ్యవసాయానికీ, తాగునీటికీ ఆధారమైన చెరువు కూడా మద్యం ఫ్యాక్టరీ నడిపే విలన్ల చేతిలోనే. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతుల ఆత్మహత్యలు... ఒక్కో కుటుంబం హైదరా బాద్‌కు వలసలు... హీరోయిన్‌దీ ఆ గ్రామమే. శ్రీమం తుల బిడ్డ అయిన హీరోవాళ్ళదీ ఆ ఊరేనని హీరోయిన్ తెలుసుకుంటుంది. ‘మీ ఊరేదో తెలుసా? ఊరొదిలి వచ్చేసిన మీ నాన్న ఆ ఊరికేం చేశారు’ అంటూ హీరోని నిలదీస్తుంది. హీరో ఆలోచనలో పడతాడు. మూలాలు వెతుక్కుంటూ ఊరి బాట పడతాడు. అక్కడ ఇంటర్వెల్ బ్లాక్.

 ఇంటర్వెల్ అయిన తరువాత నుంచి కథ ఊళ్ళో తిరుగుతుంది. ఊరికి వెళ్ళిన హీరో తానెవరో బయటపెట్టడు. ఊరి బాగు కోసం సిద్ధపడతాడు. అదే ఊరిలో పుట్టి పెరిగి, ఊరొదిలేసి పట్నానికి వచ్చేసిన తన తండ్రి ఫ్లాష్‌బ్యాక్ తెలుస్తుంది. ఇవాళ ఇంత కమర్షియల్ బిజినెస్‌మ్యాన్‌గా తన తండ్రి ఎందుకు మారాడో అర్థమవుతుంది. ఇంతకీ హీరో తండ్రి జీవితంలో ఉన్న మానని గాయం ఏమిటి? కన్నతల్లి లాంటి ఊరిని అతనెందుకు వదిలేశాడు. పది నిమిషాల ఈ ఫ్లాష్‌బ్యాక్‌తో అంతా తెలుసుకున్న హీరో ఆ ఊరికి వెనక్కి ఏమిచ్చాడు? ఊరిని వేధిస్తున్న విలన్లు హీరో కోస్టల్ కారిడార్ రానున్న ఉత్తరాంధ్రలోని వేలకొద్దీ పొలాల్ని బలవంతంగా రాయించుకోవాలన్న విలన్ల ప్లాన్ ఏమైంది? హీరోకూ, అతని తండ్రికీ మధ్య సయోధ్య కుదిరిందా? హీరో ఏ రూట్ తొక్కాడు? ఇదంతా వెండితెరపై వచ్చే ‘శ్రీమంతుడు’ మిగతా కథ.

 టీమ్ వర్క్
 అమెరికాలో డిస్ట్రిబ్యూటర్స్‌గా పేరు తెచ్చుకొన్న ముగ్గురు మిత్రులు (నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్) నిర్మాతలై, తొలిసారిగా చేసిన ప్రయత్నమిది. ‘భద్ర’, ‘ఒక్కడున్నాడు’, ‘బృందావనం’ తదితర చిత్రాల రచయితగా మొదలైన కెరీర్ కొరటాల శివది. దర్శకుడిగా ప్రభాస్‌తో ‘మిర్చి’ లాంటి సూపర్‌హిట్ తీసిన ఆయనకు డెరైక్టర్‌గా ఇది రెండో ఫిల్మ్. రచయితగా తన స్ట్రెంత్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూనే, అలవాటైన కెమెరామన్ (‘మిర్చి’ ఫేమ్ మది), అనుభవజ్ఞుడైన ఎడిటర్ (కోటగిరి వెంకటేశ్వరరావు), మ్యూజిక్ డెరైక్టర్ (దేవిశ్రీప్రసాద్) అండ తీసుకున్నారు. మహేశ్‌బాబు లాంటి సీజన్డ్ ఆర్టిస్ట్ అండ ఉండనే ఉంది. ఐటమ్ సాంగ్స్ లాంటి హంగామాలూ, కథలో కలవని సెపరేట్ కామెడీ ట్రాక్‌లూ, వినోదం పేరిట వెకిలి డైలాగ్‌లూ సినిమాలో కనిపించవు.

 రెండు సినిమాల తర్వాత...
 నిజానికి, మహేశ్ నటించిన గత రెండు సినిమాలూ - ‘1... నేనొక్కడినే’, ‘ఆగడు’ అంచనాల్ని అందుకోలేదు. ప్రేక్షకులు, ఫ్యాన్సే కాదు... మహేశ్ కూడా డిజప్పాయింటెడ్. అందుకే ఇప్పుడు ‘శ్రీమంతుడు’పై ఆశలు, అంచనాలు. ‘బాహుబలి’తో ప్రేక్షకులు, పరిశ్రమ మంచి జోష్ మీద ఉన్న టైమ్‌లో మహేశ్ కరెక్ట్‌గా మళ్ళీ తెరపైకొచ్చారు. ఎక్కడ ఉండి సినిమా చూస్తున్నవాళ్ళకైనా... కన్నతల్లి లాంటి సొంత ఊరిని గుర్తు చేశాడు! కమర్షియల్ హీరోలు తటపటాయించే ఇలాంటి స్టోరీలైన్‌ను ఓకె చేయడం, నటిస్తూనే ప్రొడక్షన్‌లో పార్ట్‌నర్ కూడా కావడం - మహేశ్ గొప్పే! ఇలాంటి కథ... మధ్య మధ్యలో ‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతో కొంత వెనక్కి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం’ లాంటి మంచి డైలాగులు... మొత్తం మీద ఒక మంచి కాన్సెప్ట్‌ను మాస్‌కు చేరవేయడంలో కొరటాల శివ ప్రయత్నం కూడా మెచ్చుకొని తీరాల్సిందే!

సొంత ఊరిని బాగుచేయడమనే కాన్సెప్ట్ కె. విశ్వనాథ్ - బాలకృష్ణల ‘జననీ జన్మభూమి’ నాటి నుంచి ఉన్నదే. అయితే, ఊరును దత్తత చేసుకొని, బాగు చేయాలంటూ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లు ఇప్పటికి ఇది గుడ్ కమర్షియల్ ఎటెంప్ట్ ఆన్ సిల్వర్‌స్క్రీన్! తమిళ, మలయాళ సీమల్లోనూ శుక్రవారమే తమిళ వెర్షన్ రిలీజైంది. క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆశించే ఆడియన్స్ అభిమానధనం ఇప్పటికి ఈ ‘శ్రీమంతుడు’ సొంతం!

 
 మీకు తెలుసా?
అన్నయ్య రమేశ్, అక్కయ్య మంజుల నిర్మాతలైన చిత్రాల్లో గతంలో మహేశ్ పాలుపంచుకున్నారు. ఇప్పుడు తొలిసారిగా ‘మహేశ్‌బాబు ఎంటర్‌టైన్ మెంట్ ప్రై.’ పెట్టి, ‘శ్రీమంతుడు’ పార్ట్‌నరయ్యారు.

‘రామ రామ’లో హీరోయిన్ పూర్ణ డ్యాన్స్ చేశారు.

ఒకప్పటి సూపర్‌హిట్ ‘పెద్దరికం’ జంట సుకన్య, జగపతిబాబు చాలా ఏళ్ల తర్వాత కలిసి నటించారు. మహేశ్ అమ్మానాన్న పాత్రలు చేశారు.

‘శంకరాభరణం’ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు, ‘స్వరకల్పన’ తదితర చిత్రాల్లో హీరోగా నటించిన ఏడిద శ్రీరామ్ చాలా ఏళ్ల విరామం తర్వాత ఇందులో ఓ పాత్ర చేశారు.

ఇంతకు ముందు కూడా మహేశ్ సినిమాలు తమిళంలోకి డబ్ అయ్యాయి. అయితే తెలుగుతో పాటే తమిళంలోనూ అదే రోజు రిలీజైన తొలి సినిమా ఇదే. తమిళ వెర్షన్ పేరు ‘సెల్వందన్’.

ఈ సినిమాకు సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి. ‘రామ... రామ’ పాటలో ముందు వచ్చే సాకీ పాడుతూ, ఆయన తెరపై కనిపిస్తారు.

ఇందులో మహేశ్ ఉపయోగించిన సైకిల్ ఖరీదు సుమారు 4 లక్షల రూపాయలు. ఆటోమేటిక్ గేర్స్ ఉండడం దీని స్పెషాల్టీ.
 
ముందు ఏమనుకున్నారంటే...
ఈ కథను మహేశ్ కన్నా ముందు ఇంకో హీరోకి చెప్పారట దర్శకుడు కొరటాల శివ. ఆ హీరో ఆసక్తి చూపకపోవడంతో ప్రాజెక్ట్ మహేశ్ దగ్గరకొచ్చింది.

‘శ్రీమంతుడు’ కన్నా ముందు ‘ఊరికి మొనగాడు’, ‘మగాడు’ లాంటి టైటిల్స్ ప్రచారమయ్యాయి.
 
ఎక్కడెక్కడ తీశారంటే...

హైదరాబాద్, ఆర్‌ఎఫ్‌సీ, పొల్లాచ్చి, కారైక్కుడి, పుణే, మలేసియా
మొత్తం వర్కింగ్ డేస్...  సుమారు 120 రోజులు
 
 
బిజినెస్ ఖబర్
 ‘శ్రీమంతుడు’ రూ. 60 కోట్ల  నిర్మాణవ్యయంతో తయారైనట్లు ప్రచారం. విడుదలకు ముందే  నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ మిగిల్చింది.   ‘శ్రీమంతుడు’ శాటిలైట్ రైట్స్  ‘జీ తెలుగు’ సొంతం చేసుకుంది.  రైట్స్ దాదాపు  రూ. 10 కోట్ల పైగా మొత్తం  పలికినట్లు వ్యాపారవర్గాల భోగట్టా. శాటిలైట్ రైట్స్  రేట్లు రూ. 10 కోట్ల పై మాట  పలకడం తెలుగు సినీ చరిత్రలో  తొలి సారి. (‘బాహుబలి’ రైట్స్ తుది రేటు ఇంకా చర్చల్లోనే ఉంది).   రెండు తెలుగు రాష్ట్రాల్లో  టికెట్ రేట్లు అధికారికంగానే బాగా పెంచేశారు. దీంతో  సినిమా నికరవసూళ్లు బాగా పెరుగుతాయి.

- రెంటాల జయదేవ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement