
ఈ కథే... సినిమా స్టోరీ అయితే..
(వెబ్సైట్ ప్రత్యేకం)
ఎట్టకేలకు పదమూడేళ్ళ తరువాత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఒక సంచలనాత్మక తీర్పు వెలువడింది. అవును సంచలన తీర్పే.. ఏదో సరదాగా పార్టీ కెళ్ళి... ముచ్చటపడి మందేసి.... పొరపాటున....రోడ్డు మీద నడపాల్సిన తన ఖరీదైన వాహనాన్ని...దిక్కూ మొక్కూలేక పేవ్మెంట్ మీద నిద్రపోతున్న కార్మికులపైకి ఎక్కించేసి...
ఒక అనామకుడ్ని చంపేస్తే.... నేరమా?
దానికి ఐదేళ్ళ జైలు శిక్ష వేయాలా?
25 వేల రూపాయల జరిమానా?
అసలు ఫుట్పాత్ మీద పడుకోమని ఎవరు చెప్పారు?
దిక్కులేనివాళ్లు ...కుక్కల్లా పేవ్మెంట్ పడుకుంటే...అంతే జరుగుతుంది...అసలు అలాంటి వాళ్ళను ముంబై లాంటి గొప్ప నగరాల నుండి తరిమికొట్టాలి ..ఇవీ తీర్పు వెలుడినప్పటినుంచీ జాతీయ మీడియాలోడిజైనర్ ఫరా అలీఖాన్, సింగర్ అభిజిత్ లాంటి వాళు చేస్తున్న చర్చలు, వాదనలు. బుధవారం సల్మాన్ ఖాన్ను దోషిగా నిర్ధారిస్తూ ముంబై సెషన్స్ కోర్టు తీర్పు వెలువడిన తరువాత దేశవ్యాప్తంగా కొంతమంది సో కాల్డ్ నటులు, హీరోగారి అభిమానుల అభిప్రాయాలు.. ఆగ్రహావేశాలు..
బాలీవుడ్ అగ్ర హీరో.. అదీ ఏక్ దమ్మున 100 కోట్ల రూపాయల వసూళ్లను సాధించగలిగే సత్తా ఉన్న హీరో. మరి అలాంటి హీరోకి ఐదేళ్ళ జైలు శిక్షా! హన్నన్నా... ఎంత అన్యాయం... ఎంత అమానుషం...అభిమానులు గుండెలు పగిలిపోవు? అభిమాన సంఘాలు బావురుమనవూ? అందుకే టాలీవుడ్ మెగాస్టార్ కూడా పాపం బాధపడ్డారు..పొరబాటుగా జరిగిందానికీ, ఉద్దేశపూర్వకంగా జరిగిందానికి తేడా చూడాలంటూ వాపోయారు... అయినా హైకోర్టుగా ఉందిగా అప్పీలు చేసుకోవడానికన్నారు.
ఎంత ధీమా ...భారత న్యాయవ్యవస్థ మీద.
ఇదంతా చూస్తున్న సగటు ప్రేక్షకుడు మాత్రం నివ్వెరపోయాడు...
చనిపోయిన పేదవాడి ప్రాణానికి విలువ లేదా?
వీధిన పడిన ఆ కుటుంబం పరిస్థితి ఏంటి?
ఇప్పుడు బాధపడే మనషులకు... ఆ ప్రాణం గాల్లో కలిసినా పట్టదా?
ఆయనకు(సల్మాన్ ఖాన్) ఎంత శిక్షపడితే మాకేంటి.. మా కడుపుకు పట్టెడన్నం దొరికితే చాలు.. అంటున్న ఆ అభాగ్యుల రోదన వీరి చెవులకెక్కదా...తప్పతాగి ...రోడ్డు మీద నడపాల్సిన కారును ఫుట్పాత్ మీద ఎక్కించేస్తే తప్పులేదుగానీ.. కనీస మౌలిక అవసరాలు తీరని పేద కార్మికుడు.. వేరే గత్యంతరం లేక అలసి సొలసి ఫుట్పాత్మీద నిద్రపోవడం నేరమా? రీల్ లైఫ్కి రియల్ లైఫ్కి అంతరాలు అవగతమైన మనసులు మౌనంగా మూలుగుతున్నాయి.
మొదటిరోజు మొదటి ఆట కోసం క్యూలో నిలబడ్డపుడు పడిన అవస్థలు.. ప్రమాదాలు.. చావులు ..ఒకటా..రెండా... ఎన్నని..వరుసగా అన్నీ ఒక్కసారిగా తెరలు తెరలుగా కదలాడాయి.. తెరపై తమ అభిమాన హీరో ఎంట్రీ కోసం..ఆ సీన్ కోసం ఆరాటపడి... ఖరీదైన కారులో...హీరో గారి పాదం అలా కనపడగానే ఈలలు....కేకలు.. వేసి.. చప్పట్లతో తీన్మార్ నృత్యం చేసిన క్షణాలు మదిలో మెదిలాయి.
అంతేనా.. ఎన్నో ప్రశ్నలు..ఎన్నెన్నో అనుమానాలు..పన్నుకు-పన్ను, కన్నుకు - కన్ను, హత్యకు హత్య ..ఏ సినిమా శుభం కార్డయినా దాదాపు ఇదే కదా.. మరి 13 ఏళ్ళ పాటు జీళ్లపాకంలా సాగిన ఈ కారు కథనే సల్మాన్ఖాన్ను హీరోగా పెట్టి సినిమాగా తీస్తే ముగింపు ఎలా ఉంటుంది.
ఫుట్పాత్మీద పడుకునే నిర్భాగ్యులు లేని దేశంగా మన భారతదేశాన్ని మార్చేస్తారా... అవినీతి కుళ్లు కంపుకొడుతున్న వ్యవస్థను అమాంతం ప్రక్షాళన చేసేలా ఉంటుందా? పేద, ధనిక అన్న తేడా లేకుండా రాజ్యాంగంలో ఆమోదించుకున్న చట్టాల అమలుకు పూనుకుంటారా? లేకపోతే....కార్మికుడి చావుకు కారణమైన వ్యక్తిని....???
(సూర్యకుమారి)