
'పాకిస్థాన్ నుంచి అన్నీ ఆపేయండి'
ముంబై: పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విషయంలో ప్రభుత్వం కపటబుద్ధితో వ్యవహరిస్తోందని బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ విమర్శించాడు. పాకిస్థాన్ తో సంబంధాలు తెంచుకోవాలని భావిస్తే ఆ దేశానికి చెందిన అన్నిటిపైనా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. 18వ జియో 'మామి' ఫిల్మ్ ఫెస్టివల్ లో అతడు మాట్లాడుతూ... మిగతావి అన్ని వదిలేసి పాకిస్థాన్ కళాకారులపైనే ఆంక్షలు విధించడం సరికాదన్నాడు.
'పాకిస్థాన్ కు చెందిన వాటిని నిషేధించాలనుకుంటే అన్నిటిపైనా ఆంక్షలు విధించండి. ఒక్క సినిమాలనే నిషేధించడం సరికాదు. పొరుగు దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు కూడా ఆపేయండి. మీరు సగం పనిచేస్తే ఎవరూ సీరియస్ గా తీసుకోరు. నేను కూడా ప్రభుత్వాన్ని సీరియస్ గా తీసుకోను. పాకిస్థాన్ కు చెందిన వాటిపై నిషేధం వల్ల మన సైనికులకు మంచి జరుగుతుందనుకుంటే నేను తప్పకుండా సమర్థిస్తాను. అంతేకాని ఈ వివాదంపై అనవసరం రాద్ధాంతం చేయడం మంచిది కాద'ని అభయ్ డియోల్ స్పష్టం చేశాడు. పాకిస్థాన్ కళాకారులు నటించిన సినిమాలను అడ్డుకుంటామని ఎమ్మెన్నెస్ హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.