నా కళ్ల ముందే మా అమ్మ ఎదిగింది!
‘మా అమ్మ నా కళ్ల ముందు ఎదిగింది’ అని ఇలియానా అంటున్నారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎదగడమేంటి? అని ఆశ్చర్యపోవచ్చు. ఈ గోవా బ్యూటీ చెప్పినది శారీరక ఎదుగుదల గురించి కాదు.. వ్యక్తిగా తన తల్లి ఎదిగిన వైనాన్ని చెబుతున్నారు. పెళ్లయిన తర్వాతే ఇలియానా తల్లి చదువుకున్నారట. ఆ విషయంతో పాటు తన తల్లి గురించి ఇలియానా మాట్లాడుతూ - ‘‘మా అమ్మ ముస్లిమ్. నాన్నగారు క్రిస్టియన్. ప్రేమకు మతాలతో సంబంధం లేదని భావించి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మామూలుగా ముస్లిమ్ కుటుంబాల్లో ఆడపిల్లలకు కొన్ని నియమాలుంటాయి.
ఆ నియమాల్లో భాగంగా మా అమ్మ పెద్దగా చదువుకోవడానికి వీలు పడలేదు. బాగా చదువుకోవాలని, సొంత కారు ఉండాలని, జీన్స్ వేసుకుని, సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్‌గా తిరగాలని.. ఇలా ఆమెకు ఏవేవో కోరికలుండేవి. పెళ్లయ్యాక ఒక్కో కోరికను తీర్చేసుకుంది. డిగ్రీ పూర్తి చేసింది. మేం అప్పుడు చిన్నపిల్లలం. నన్నూ, నా సిస్టర్‌ని తనతో పాటు కాలేజీకి తీసుకెళ్లేది.
అమ్మ శ్రద్ధగా చదువుకోవడం చూశాను. అంతకుముందు నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడటానికి భయపడేది. ఇంగ్లిష్ కూడా రాదు. చదువుకోవడం మొదలుపెట్టాక ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. గడాగడా ఇంగ్లిష్ మాట్లాడటం మొదలుపెట్టింది. నా కళ్ల ముందే మా అమ్మ ఒక్కో మెట్టూ ఎదిగింది. అందుకే జీవితంలో నీకు ఎవరు ఆదర్శం అని అడిగితే, ‘మా అమ్మ కాకుండా ఇంకా ఎవరుంటారు?’ అని చెబుతుంటాను’’ అని తన తల్లి గురించి ఇలియానా చాలా గొప్పగా, గర్వంగా, మురిపెంగా చెప్పారు.