Goa Beauty
-
నా కళ్ల ముందే మా అమ్మ ఎదిగింది!
‘మా అమ్మ నా కళ్ల ముందు ఎదిగింది’ అని ఇలియానా అంటున్నారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎదగడమేంటి? అని ఆశ్చర్యపోవచ్చు. ఈ గోవా బ్యూటీ చెప్పినది శారీరక ఎదుగుదల గురించి కాదు.. వ్యక్తిగా తన తల్లి ఎదిగిన వైనాన్ని చెబుతున్నారు. పెళ్లయిన తర్వాతే ఇలియానా తల్లి చదువుకున్నారట. ఆ విషయంతో పాటు తన తల్లి గురించి ఇలియానా మాట్లాడుతూ - ‘‘మా అమ్మ ముస్లిమ్. నాన్నగారు క్రిస్టియన్. ప్రేమకు మతాలతో సంబంధం లేదని భావించి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మామూలుగా ముస్లిమ్ కుటుంబాల్లో ఆడపిల్లలకు కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాల్లో భాగంగా మా అమ్మ పెద్దగా చదువుకోవడానికి వీలు పడలేదు. బాగా చదువుకోవాలని, సొంత కారు ఉండాలని, జీన్స్ వేసుకుని, సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్‌గా తిరగాలని.. ఇలా ఆమెకు ఏవేవో కోరికలుండేవి. పెళ్లయ్యాక ఒక్కో కోరికను తీర్చేసుకుంది. డిగ్రీ పూర్తి చేసింది. మేం అప్పుడు చిన్నపిల్లలం. నన్నూ, నా సిస్టర్ని తనతో పాటు కాలేజీకి తీసుకెళ్లేది. అమ్మ శ్రద్ధగా చదువుకోవడం చూశాను. అంతకుముందు నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడటానికి భయపడేది. ఇంగ్లిష్ కూడా రాదు. చదువుకోవడం మొదలుపెట్టాక ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. గడాగడా ఇంగ్లిష్ మాట్లాడటం మొదలుపెట్టింది. నా కళ్ల ముందే మా అమ్మ ఒక్కో మెట్టూ ఎదిగింది. అందుకే జీవితంలో నీకు ఎవరు ఆదర్శం అని అడిగితే, ‘మా అమ్మ కాకుండా ఇంకా ఎవరుంటారు?’ అని చెబుతుంటాను’’ అని తన తల్లి గురించి ఇలియానా చాలా గొప్పగా, గర్వంగా, మురిపెంగా చెప్పారు. -
అన్నీ చెప్పేస్తే...ఇంకేం ఉంటుంది!
‘‘నాకెలా నచ్చితే అలా ఉంటా.. ఏది అనిపిస్తే అది ఓపెన్‌గా చెప్పేస్తా. పొగడ్తలంటే అసహ్యం. ఉచిత సలహాలిస్తే అస్సలు నచ్చదు’’ అంటున్నారు ఇలియానా. ఈ గోవా బ్యూటీకి నచ్చని, నచ్చే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ► నేను హీరోయిన్ని కాబట్టి ఇరవైనాలుగు గంటలూ ఎంటర్టైన్ చేయాలనుకుంటే నా వల్ల కాదు. కెమెరా కోసం మాత్రమే నటిస్తాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంత న్యాయం చేయాలో అంతా కెమెరా ముందు చేసేస్తాను. ఆ తర్వాత ఇతరుల ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచించను. నా గురించి ఆలోచించుకుంటాను. ► నేను చాలా ఫ్రెండ్లీ పర్సన్‌ని. నా ఫ్రెండ్షిప్ని ఇతరులు ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకుంటాను. ఒకవేళ ఇష్టపడకపోతే వాళ్లతో బలవంతంగా స్నేహం చేయను. ► ఈ ప్రపంచంలో ఎంత బెస్ట్ పర్సన్ అయినా, అందర్నీ మెప్పించలేరు. ఎక్కడో చోట ఎవరో ఒకర్ని నిరుత్సాహపరుస్తారు. అది సహజం. అందుకే అందర్నీ మెప్పించడానికి ట్రై చేయను. ఎవరైనా నన్ను అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. ► నా వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడను. అన్ని విషయాలూ చెప్పేస్తే ఇంకేముంటుంది? అందుకే కొన్నయినా దాచుకుంటా. ఒకరి కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను. నాకెలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. అలా ఉండటం తప్పు అని ఎవరైనా అంటే కేర్ చేయను. ► నేను అందంగా ఉండనని నా ఫీలింగ్. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలా ఉండననుకుంటాను. అమ్మాయి దేహంలోకి బలవంతంగా ఇరికించిన అబ్బాయినేమో అనిపిస్తుంటుంది. ► సోషల్ నెట్వర్క్ అంటే ఇష్టం. ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా అందరితోనూ టచ్‌లో ఉండొచ్చు. ► నేను పార్టీ యానిమల్‌ని కాదు. ముఖ్యంగా హాట్ డ్రింక్స్ తీసుకునేవాళ్ల మధ్యలో ఉండటానికి ఇష్టపడను. ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు అక్కడున్నవాళ్లు మాట్లాడుతున్నంతసేపూ హాయిగా మాట్లాడతాను. మద్యం పుచ్చుకోబోతున్నారని తెలియగానే అక్కణ్ణుంచి వెళ్లిపోతా. ► యాక్చువల్‌గా ఫొటోగ్రాఫర్స్ కనిపించగానే మొహం మీద చిరునవ్వు పులుముకుని పోజులిచ్చే టైప్ కాదు నేను. కెరీర్ ఆరంభించిన మొదట్లో చాలా ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత తర్వాత వృత్తిలో ఇది కూడా భాగమే అని సర్ది చెప్పుకున్నా. అప్పట్నుంచీ ఫొటోలకు పోజులివ్వడం పెద్ద ఇబ్బందిగా అనిపించడంలేదు. ► సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హద్దులు దాటడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా చొరవ తీసుకోవాలనుకుంటారు. అలాంటివాళ్లకు వీలైనంత దూరంగా ఉంటాను. -
ఇక్కడ ఎవరి పోరాటం వాళ్లది!
‘‘జీవితం అంటేనే పోరాటం. తుది శ్వాస విడిచే వరకూ పోరాడాలి’’ అని ఇలియానా అంటున్నారు. జీవితం గురించి ఇప్పుడీ రేంజ్లో ఈ గోవా బ్యూటీ మాట్లాడటానికి కారణం ఉంది. ఇటీవల ఎవరో ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి తన అభిప్రాయం చెప్పడం ఇలియానా విన్నారట. అసలా వ్యక్తి జీవితం ఏంటో? అతని మనస్తత్వం ఏంటో తెలుసుకోకుండా ఇలా ఒక అభిప్రాయానికి రావడం ఇలియానాకి విచిత్రంగా అనిపించిందట. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘ఈ ప్రపంచంలో సమస్యలు లేనివాళ్లంటూ ఎవరూ ఉండరు. ఎవరి సమస్యలు వాళ్లకుంటాయి. ఎవరి పోరాటం వాళ్లది. ఇతరుల జీవితాన్ని పై పైన చూసేసి, వాళ్లు గురించి స్టేట్మెంట్ ఇచ్చేయడం సరి కాదు. ఆ మాటకొస్తే.. అసలు ఎవరి గురించీ ఒక జడ్జిమెంట్‌కి రాకూడదు. ఇక్కడ ఎవరూ ఉత్తములు కాదు.. ఎవరూ అథములూ కాదు. అందుకే ఎవర్నీ విమర్శించకూడదు. వీలైతే ఫ్రెండ్లీగా ఉండాలి’’ అన్నారు. -
దక్షిణాదిపైనే దృష్టి: ఇలియాన
ఇలియాన నీ ఇడుపు మాట అంటూ యువత ఈల పాట పాడుకునేంత ప్రాచుర్యం పొందిన నటి ఇలియాన. ఇంతకుముందు దక్షిణాదిలో ఏలిన ఈ గోవా సుందరి ఇప్పుడు ఉత్తరాదిలో నాయకిగా బలపడాలని ఆశపడుతున్నారు. దక్షిణాదిలో పలు విజయాలను సొంతం చేసుకున్న ఇలియాన అక్కడ అపజయాలను ఎదుర్కొని జయాల కోసం పోరాడుతున్నారు. దీంతో మళ్లీ దక్షిణాదిపై తిరిగి దృష్టి సారించాలని భావిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడే ఈ క్రేజీ నాయకితో చిన్న భేటీ.... ప్రశ్న : మీ జీవితం ఊహించని స్థాయిలో నడుస్తోందా? జవాబు: అంతకంటే బ్రహ్మాండంగా సాగుతోంది. ప్రశ్న: జయాపజయాలను ఎలా తీసుకుంటారు? జవాబు: జీవితంలో ఆ రెండే అలక్ష్యం చేయలేనివి. విజయం బాధను పోగొడుతుంది. ఉత్సాహాన్ని పెంచుతుంది. బాలీవుడ్లో బర్ఫీ చిత్రం నాకలాంటి ఆనందాన్ని అందించింది. ఆ తరువాత చేసిన చిత్రం కొంచెం నిరాశపరచింది. తాజా చిత్రం విజయాన్ని అందిస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నా. ప్రశ్న: మీ సహ నటీమణుల్లో ఎవరిని పోటీగా భావిస్తున్నారు? జవాబు: ఎవరిని పోటీగా భావించడం నా కిష్టం లేదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రతిభ ఉంటుంది. విజయాలు వరిస్తుంటాయి. ప్రశ్న : ఎవరి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నారు? జవాబు: ఒక నటిగా దర్శకులదరితోనూ పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే నాలోని ప్రతిభను వెలికి తీయగల దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నాను. ప్రశ్న: ప్రేమ విషయంలో మీ అభిప్రాయం? జవాబు: ప్రేమ అనేది జీవితంలో ఒక అంగం. నిజమైన ప్రేమను పొందడం కష్టం. ఒకవేళ అలాంటి ప్రేమ లభించినా, దానిని నిలుపుకోవడం అంతకంటే కష్టం. ఏదేమైనా ప్రేమ, పెళ్లి ఈ రెండింటిపైనా నాకు నమ్మకం. ప్రశ్న: వివాహ జీవితం సహజీవనం ఈ రెండు విధానాలపై మీ అభిప్రాయం? జవాబు: ఇది ఇద్దరు జీవితాలకు సంబంధించిన అంశాలు. వివాహ జీవితంలో పలు అనుబంధాలను కాపాడుకోవాల్సిన నిర్బంధం ఉంటుంది. సహజీవనం (లీవ్ ఇన్ రిలేషన్ షిప్) అలాంటిది కాదు. ఇది ఇద్దరు చేసుకునే ఒప్పందం. ఈ తరహా జీవితంలో ఎప్పుడైనా విడిపోవచ్చు. వివాహ జీవితంలో అలా కుదరదు. ఒక్కమాటలో చెప్పాలంటే వివాహ జీవితం ఫ్లైట్ యానం లాంటిది. సహ జీవనం రైలు ప్రయాణం లాంటిది. ప్రశ్న: భవిష్యత్తులో ఎలా జీవించాలనుకుంటున్నారు? జవాబు: నేను 18 ఏళ్ల వయసులోనే నటినయ్యా ను. అందుకే కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాను. -
అమ్మకానికి ఇలియానా ఇల్లు!
ఇలియానా దక్షిణాదికి టాటా చెప్పేసిందా?... ఔనన్నది కొందరి ఊహ. అలా ఊహించడానికి కారణం లేకపోలేదు. ‘బర్ఫీ’ చిత్రం ద్వారా రెండేళ్ల క్రితం హిందీ తెరపై మెరిసిన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత దక్షిణాది వైపు కన్నెత్తి చూడలేదు. దాంతో.. ఇక ఇలియానాకి దక్షిణాది సినిమాలు చేసే ఉద్దేశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టు హైదరాబాద్‌లో ఎప్పుడో తాను కొన్న ఇంటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టిందట ఇలియానా. ఈ ఇంటి విలువ దాదాపు కోటిన్నర అని సమాచారం. ఒకవేళ దక్షిణాదిన సినిమాలు ఒప్పుకుంటే.. షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చి, వెళ్లిపోవచ్చని. అంతమాత్రం దానికి ఇక్కడ ఇల్లెందుకు? అని ఇలియానా అనుకుని ఉంటుంది. అందుకే తను కొన్న లగ్జరీ ఫ్లాట్‌ని అమ్మాలనుకుని ఉంటుంది. ఇలియానికి గోవాలో సొంత ఇల్లు ఉంది. హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ముంబయ్‌లో ఇల్లు కొనుక్కుందని భోగట్టా.