
ఆ లెజెండ్ స్మృతిలో..
చెన్న్: సుమారు నాలుగు దశాబ్దాలపాటు సంగీత ప్రపంచాన్నేలిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్కు నివాళిగా మరో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన లెజెండ్రీ సంగీత దర్శకుడి స్మృతిలో నెల 27న సంగీత విభావరి నిర్వహించేందుకు పూనుకున్నారు. "ఎన్నుల్లే ఎల్లా ఎంఎస్వీ" పేరుతో చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఇళయ రాజా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
విశ్వనాథన్ స్వరపర్చిన 30 టాప్ పాటలను ఈ విభావరిలో ఆలపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంఎస్వీ బృందంలోని సభ్యులందర్నీఒక చోటకు చేర్చాలని మాస్ట్రో ఆలోచిస్తున్నారు. అలాగే ఎంఎస్వీ సంగీత దర్శకత్వంలో సినీగీతాలను ఆలపించిన గాయనీ గాయకులందర్నీ కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. కాగా 750 సినిమాలకు పైగా స్వరాలను సమకూర్చిన విశ్వనాథన్ ఇళయారాజాను బాగా ప్రభావితం చేశారని సినీ పండితులు చెబుతారు.