'ఏదో ఒక రోజు ముసలివాళ్లం అయిపోతాంగా..'
లాస్ ఎంజెల్స్: తాను చూసేందుకు కఠినంగా కనిపించినా అవసరానికి తగినట్లే ఉంటానని, అది మంచి ఫలితాలు ఇస్తుందని ప్రముఖ హాలీవుడ్ నటుడు ఐస్ క్యూబ్ (షియా జాక్సన్) అన్నారు. తనకు ఇప్పుడు ఐదుగురు సంతానం అని చెప్పిన ఆయన పిల్లల పెంపకం విషయంలో ఎవరెన్ని చెప్పినా తాను మాత్రం సామాజిక స్పృహతోనే వారిని పెంచుతానని చెప్పారు. అదే సమయంలో వారికి అవసరమైనవేమిటో గుర్తిస్తానని, విచక్షణ పాటిస్తానని చెప్పారు.
'నేను కఠినంగా ఉంటాను. కానీ, సరైన వాడిని. నా పిల్లలను గౌరవిస్తాను. ఇలాంటి దృక్పథాన్ని ప్రతిఒక్కరూ అనుసరిస్తే బాగుంటుందని నేను భావిస్తాను. ఇది అన్ని సమయాల్లో నియంతృత్వం అనిపించుకోదు. పిల్లలు చిన్నవాళ్లు. వారికి పెద్దగా ఏం తెలియదు. వారికి యువకుల్లో ఉన్నట్లువంటి ఆలోచనలు ఉండవు. ఒక తెలివైన వ్యక్తి నాతో ఏం చెప్పారంటే.. నీ పిల్లల విషయంలో మంచిగా ఉండండి. ఎందుకంటే ఏదో ఒక రోజు నీవు ముసలివాడివి అయిపోతావు. వారిని మంచి పిల్లలుగా చూడాలంటే నువ్వు మంచి తండ్రిగా ఉండాలి. ఈ విషయం ఎప్పటికీ మనసులో పెట్టుకో అని' ఆయన చెప్పారు.