
నిజాలే చూపించాలి!
తమిళసినిమా: మహానటి సావిత్రి జీవిత చరిత్ర తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. జెమినీగణేశన్‌గా మాలీవుడ్ యువ నటుడు దుల్కర్‌సల్మాన్ నటిస్తుండగా ఒక ప్రత్యేక పాత్రలో చెన్నై చిన్నది సమంత నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెట్‌పైకి వెళ్లింది. అభినేత్రి సావిత్రి చరమ దశలో ఉన్నప్పుడు, కన్నుమూసిన తరువాత ఆమె గురించి చాలా కథనాలు వెలువడ్డాయి. మరణానికి ముందు ఆర్థికసమస్యలను ఎదుర్కొన్నారన్నది ఆ కథనాల్లో ప్రధానమైంది.
సావిత్రి మరణించడానికి ముందు ఆమె ఫొటోలు కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆ ఫొటోల విషయమై సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి మండిపడ్డారు. ఆమె పేర్కొంటూ తన తల్లి ఆర్థికసమస్యలతో ఎప్పుడూ కష్టపడలేదన్నారు. రెండు తరాలు సుఖ సంతోషాలతో జీవిం చేలా తమకు ఆస్తులను ఇచ్చారని తెలిపారు.తన తల్లి మధుమేహ వ్యాధికి గురయ్యారని అన్నారు. అయితే తన భర్త జెమినీగణేశన్ బాగానే చూసుకున్నారని చెప్పారు. తన తల్లి జీవిత చరిత్రతో తెరకెక్కిస్తున్న చిత్రంలో నిజాలే చూపిం చాలని, స్క్రిప్ట్ మాకు చూపించి ఆ మోదం పొందిన తరువాతే షూటింగ్ జరపాలని దర్శక నిర్మాతలకు షరతులు విధించినట్లు, అందుకు వారు అంగీకరించినట్లు నటి సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి చెప్పినట్లు తమిళపత్రికలు పేర్కొన్నాయి.