
భారత్ లో వెండితెర.. పాకిస్తాన్ లో బుల్లితెర!
న్యూఢిల్లీ: ఆధునిక సమాజంలో చోటు చేసుకునే వాస్తవ పరిస్థితులను సినిమాల రూపంలో తెరకెక్కించడంలో పాకిస్తాన్ కంటే భారత్ చాలా ముందు వరుసలో ఉందని పాక్ ఫ్యాషన్ ఐకాన్ సనామ్ సయీద్ అభిప్రాయపడింది. కానీ, పాకిస్తాన్ లో మాత్రం ఏమి చెప్పాలన్నా టెలివిజన్లనే ఎక్కువ నమ్ముకుంటారని స్సష్టం చేసింది. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఫోన్లో ఇచ్చిన ఇంటర్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. 'జిందగీ గుల్జార్ హై' షోతో భారత్ ప్రేక్షకులకు పరిచయమైన సనామ్.. అత్యధిక సినిమాలను నిర్మించే సత్తా భారత్ లో ఉందని పేర్కొంది. పాకిస్తాన్ లో మాత్రం చాలా తక్కువగా సినీ నిర్మాణం జరుగుతుందని తెలిపింది.
భారత్ లో సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చినంతగా ఇక్కడ(పాకిస్తాన్)లో ఇవ్వరు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలను నిర్మించే చిత్ర పరిశ్రమల్లో ఒకటైన బాలీవుడ్ లో రాజకీయాలు, ప్రేమ, కుటుంబ తరహా కథల్ని సినిమా రూపంలో తెరకెక్కిస్తుంటారని సనామ్ తెలిపింది. అది యువ నటులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు దోహదం చేస్తుందని ఆమె పేర్కొంది. 'పాకిస్తాన్ లో ఎక్కువ చిత్రాలు నిర్మించరు. మాకు థియేటర్ లు కూడా తక్కువే. మేము ఏదైనా చెప్పడానికి బుల్లితెరనే నమ్ముకుంటాం'అని సనామ్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ లో అత్యధిక శాతం మంది ఇంట్లో కూర్చునే వినోదాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారని.. వారికి కావాల్సినది టీవీల రూపంలో దొరుకుతుండటమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చని తెలిపింది.