మన సినిమాలపై నిషేధం ఎత్తివేత?
Published Tue, Oct 25 2016 2:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
భారతీయ సినిమాలపై నిషేధాన్ని ఎత్తేసి.. వాటిని కూడా తమ థియేటర్లలో ప్రదర్శించాలని పాక్ థియేటర్ యజమానులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు భారతదేశంలో పరిస్థితులు చక్కబడటం వల్లే ఇలా చేస్తున్నట్లు థియేటర్ల యజమానులు చెబుతున్నారు. ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వాధినేతలు కూడా ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ) ఈ నెల ఆరంభంలో పాకిస్థానీ నటీనటులపై నిషేధం విధించడంతో.. పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలను విడుదల కానివ్వబోమని అక్కడి థియేటర్ల యజమానులు చెప్పిన విషయం తెలిసిందే. ఉడీ ఉగ్రదాడిలో భారత సైనికులు 19 మంది మరణించడంతో ఐఎంపీపీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
నిజానికి పాక్ థియేటర్లు చాలావరకు బాలీవుడ్ సినిమాల మీదే ఆధారపడ్డాయి. ఆ సినిమాలు ఆడిస్తేనే తమకు నాలుగు డబ్బులు వస్తాయని, అందువల్ల ఎక్కువ కాలం బాలీవుడ్ సినిమాలు ఆపేసి తాము మనుగడ సాగించలేమని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యజమాని ఒకరు తెలిపారు. భారతీయ సినిమాలపై నిషేధం ఎత్తేస్తున్నామన్న అధికారిక ప్రకటన కూడా వెలువడొచ్చని అంటున్నారు.
Advertisement