హైదరాబాద్‌లో అతిపెద్ద సినిమా పండుగ
హైదరాబాద్: ఆసియా ఖండంలోనే అతి పెద్ద సినిమా పండుగకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ పేరుతో సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు జరగనున్న సినీ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన తలసాని.. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ ద్వారా సినిమా రంగంలోని అన్ని కళలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ వేడుకలో 75దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని, యూరోపియన్, చైనీస్ సినిమా రంగం నుంచి కూడా ప్రముఖులు, అతిధులు వస్తారని వివరించారు.
కార్నివాల్‌లో భాగంగా 200కు పైగా స్టాల్స్ ద్వారా ఒక మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. ఎగ్జిబిషన్‌లో పాల్గొనేందుకు సుమారు 100 సంస్థలు ఆసక్తి చూపాయని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యానిమేషన్ సంస్థలు.. డిస్ని, ప్యారామౌంట్, డ్రీమ్‌వరల్డ్, కేన్స్, దుబాయి ఫిల్మ్ మార్కెట్ తదితర సంస్థలు స్టాళ్లను ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. ఫిలిం కార్నివాల్ లో భాగంగా 80 దేశాలకు చెందిన 200 చిత్రాలు, దాదాపు 1000 లఘు చిత్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 300 మంది పెట్టుబడిదారులకు.. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయతలపెట్టిన అంతర్జాతీయ ఫిలిం ఇనిస్టిట్యూట్‌ను చర్చించనున్నట్లు తెలిపారు. ఈ ఇనిస్టిట్యూట్ స్థాపన కోసం 50 నుంచి 100 ఎకరాల స్థల సేకరణను వేగవంతం చేశామన్నారు.