
తమిళసినిమా: నటులు విశాల్, కార్తి, నాజర్, పొన్‌వన్నన్‌ను విచారించాలంటూ మద్రాసు హైకోర్టు సెంట్రల్ నేర పరిశోధన పోలీసు అధికారులకు శనివారం ఆదేశాలు జారీచేసింది. వివరాలు.. 2015లో జరిగిన దక్షిణభారత నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు విశాల్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు చేసిన వాగ్ధానాల్లో సంఘ భవన నిర్మాణం ఒకటి. ఇందుకోసం సంఘ నిర్వాహకులు స్టార్ క్రికెట్ పోటీలను నిర్వహించారు.
ఆ కార్యక్రమం ప్రసార హక్కులను ఓ ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇచ్చారు. ఆ స్టార్ క్రికెట్ పోటీల కార్యక్రమానికి సేకరించిన నిధిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సంఘ సభ్యుడు వారాహీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శనివారం విచారించిన న్యాయస్థానం తగిన ఆధారాలుంటే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేయవచ్చని పేర్కొంది. అదే విధంగా దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్, ఉపాధ్యక్షుడు పొన్‌వన్నన్, కోశాధికారి కార్తిలను విచారించాలని సెంట్రల్ నేర పరిశోధన పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేసింది.