ఎన్టీఆర్‌లా నటించడం కష్టమన్నాడు : పూరి
‘‘ఫస్ట్ కాపీ చూసిన తర్వాత.. ‘మీకు కోపం వచ్చినా సరే.. మీ కెరీర్‌లో బెస్ట్ సినిమా ఇదండీ’ అన్నారు నాతో కల్యాణ్‌రామ్. ‘అంతకంటే సంతోషం ఏముంటుంది’ అన్నాను. నిజాయితీ ఉన్న సినిమా ఇది’’... అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన ‘ఇజం’ రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ చెప్పిన విశేషాలు...
పదిహేనేళ్లుగా కంటిన్యూగా సినిమాలు చేసింది నేను, రవితేజ మాత్రమే. ఇప్పుడు తను సినిమా చేసే మూడ్‌లో లేడు. ట్రావెలింగ్‌లో ఉన్నాడు. ప్రపంచమంతా తిరుగుతున్నాడు. నన్ను కూడా సినిమాలు మానేసి తనతో రమ్మంటున్నాడు. (నవ్వుతూ..) మనిద్దరం సినిమా చేద్దామంటే వస్తాడా? చెప్పండి!
అవినీతిపై యుద్ధం చేసే ఓ విలేకరి కథే ‘ఇజం’. మనిషి ఉన్నంత వరకూ సమాజంలో అవినీతి అనేది ఉంటుంది. పదేళ్ల క్రితమే ఈ కథ రాశాను. అయితే.. ఈ పదేళ్లలో అవినీతి తీరు మారింది. ఆ మార్పులకు అనుగుణంగా కథను మార్చాను. ‘వికీలీక్స్’ అసాంజ్ స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ రాశాను. నేను తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’కి, ఈ కథకీ సంబంధం లేదు.
కల్యాణ్‌రామ్‌తో ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే.. జర్నలిస్టుగా నటించే వ్యక్తిలో నిజాయితీ కనిపించాలి. బేసిక్‌గా ఆయనలో ఆ నిజాయితీ ఉంది. సెకండాఫ్‌లో ఫర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ నటుడు పురస్కారం కల్యాణ్‌రామ్‌కే వస్తుందని నా నమ్మకం. జావేద్ భాయ్‌గా జగపతిబాబు, అతడి కూతురిగా హీరోయిన్ అదితీ ఆర్య నటన బాగుంటుంది.
హిందీ నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ, ముంబై వెళ్లి డిస్కషన్స్ చేసి, సినిమా సెట్ కావడానికి ఐదు నెలలు పడుతుంది. ఈలోపు తెలుగులో ఓ సినిమా తీసేయొచ్చు. హిందీలో ‘టెంపర్’ రీమేక్ చేద్దామని అభిషేక్ బచ్చన్‌కి చూపించాను. ‘ఎన్టీఆర్‌లా నటించడం కష్టం. ఆయన చేసిన ఫర్ఫార్మెన్స్ నేను చేయలేను’ అన్నాడు.
సమాజంలో క్రమశిక్షణ లేదనే బాధతో ‘జన గణ మన’ కథ రాశాను. మహేశ్‌బాబుకు కథ చెప్పాను. బాగా నచ్చిందన్నారు. కానీ, ఆ తర్వాత రిప్లై ఇవ్వలేదు. ఆ కథతో ఎప్పుడు సినిమా తీస్తానో? ఎవరితో తీస్తానో? చెప్పలేను. అంత ఎందుకు.. పవన్‌కల్యాణ్‌కి ‘పోకిరి’, మరొకరికి ‘ఇడియట్’ కథలు నచ్చలేదు. ప్రతి సినిమాకీ ఓ టైమ్ రావాలి. నా దగ్గర పదేళ్లకు సరిపడా కథలున్నాయి.
నిర్మాత సీఆర్ మనోహర్ కుమారుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న ‘రోగ్’ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ డిసెంబర్‌లో విడుదల చేస్తాం. ఎన్టీఆర్‌తో సినిమాపై ఓ వారంలో స్పష్టత వస్తుంది. మంచి ఎంటర్‌టైనింగ్ సినిమా అది.