'ఆస్కార్ గెలిచినంత ఆనందంగా ఉంది'
చెన్నై: కిక్ బాక్సర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి సినీనటిగాను నిరూపించుకుంది రితికా సింగ్. తమిళ చిత్రం 'ఇరుధి సుత్రు' (హిందీలో 'సాలా ఖద్దూస్') లో నిజజీవిత పాత్రను అద్భుతంగా పోషించిన రితికా సింగ్‌కు స్పెషల్ మెన్షన్ కేటగిరీ కింద జాతీయ అవార్డు లభించింది.
'నిజంగా నాకు నోట మాట రావడం లేదు. ఆస్కార్ అవార్డు గెలిచినంత ఆనందంగా ఉంది. ఇంతటి గౌరవాన్ని అందించినందుకు 'ఇరుథి సుత్రు' చిత్రయూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు చెప్తున్నా. తొలి సినిమాకు ఇలాంటి అవార్డు రావడం అంటే ఎంతో గొప్ప విషయం. మరింత ఉత్తమంగా పనిచేసేందుకు దీనిని ప్రోత్సాహంగా స్వీకరిస్తాను' అని రితికా సింగ్ ఆనందం వ్యక్తం చేశారు.
చేపలు పట్టుకునే ఓ యువతి.. మాజీ కిక్ బాక్సింగ్ చాంపియన్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది.. అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచే కథతో 'ఇరుథి సుత్రు' చిత్రం తెరకెక్కింది. ఇందులో రితిక చేపలు పట్టే అమ్మాయిగా మంచి అభినయాన్ని కనబర్చగా, మాజీ కిక్ బాక్సింగ్ చాంపియన్‌గా, కోచ్‌గా మాధవన్ నటించాడు. మన తెలుగు వ్యక్తి అయిన సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇది
'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రంలో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్న తనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కడంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసింది. ఇది తనకు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్‌లాంటిందని ఆమె పేర్కొంది. మంగళవారం కంగనా 29వ పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో తనకు జాతీయ పురస్కారం దక్కడం ఎంతో థ్రిల్ కలిగిస్తున్నదని ఓ ప్రకటనలో తెలిపింది. అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడిగా, తాను ఉత్తమ నటిగా ఒకేసారి పురస్కారాలు అందుకోవడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని పేర్కొంది. కంగనాకు ఇది మూడో జాతీయ చలనచిత్ర పురస్కారం. 'ఫ్యాషన్' సినిమాకు ఉత్తమ సహాయ నటిగా, 'క్వీన్' సినిమాకు ఉత్తమ నటిగా, ప్రస్తుతం 'తను వెడ్స్ మను రిటర్న్స్'కు మరోసారి ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకుంది.